ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వంటి పోస్టులు నిర్వహణ అంటే మాటలు కాదు.. ఒక రాష్ట్రానికి సంబంధించి సీఎం తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. మరి ముఖ్యమంత్రి కూడా మనిషే కదా.. ఆయనకూ ఉండేది 24 గంటలే కదా.. మామూలు సమయాల్లో అంటే ఓకే.. కానీ రాష్ట్రవిభజన జరిగిన తర్వాత ఏపీ వంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమంటే చాలా కష్టమైన బాధ్యతే. బరువును అర్థం చేసుకుని పంచుకునే సహచరులుంటే ఇలాంటి సమయాల్లో కీలక నేతలకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. సహజంగా ఈ బరువు బాధ్యతలు ఆయా నేతల కోటరీలో వారు పంచుకుంటారు. చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన కూడా కోటరీ మెయింటైన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. క్యాబినెట్ సహచరులు, సీనియర్లు ఎంత మంది ఉన్నా... ఆయన కొందరిపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని చెప్పకతప్పదు. అందులో ముందు వరుసలో ఉండేవారు సుజనా చౌదరి, సీఎం రమేశ్, నారాయణ. ముందొచ్చిన చెవుల కన్నా.. వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్న సామెత ఈ నాయకుల విషయంలో చక్కగా వర్తిస్తుంది. పార్టీని నమ్ముకున్న సీనియర్లు ఎందరో ఉన్నా.. బాబు ప్రతి బాధ్యతనూ వీరిపైనే మోపుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ఆయన బాధ్యతల పంపకం చేసినట్టున్నారు. ఎందుకంటే.. రాజకీయ విషయాల్లో సీఎం రమేశ్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక రాజధాని విషయాలు ఎక్కువగా కొత్త మంత్రి నారాయణ చూసుకుంటున్నారు. మరో నేత సుజనా చౌదరి కూడా పార్టీ ఆర్థిక విషయాల్లో ఎక్కువ చురుగ్గా ఉంటున్నారు. కొత్తగా ఏపీ ఆర్థిక వనరుల సమీకరణ కమిటీ ఛైర్మన్ గా కూడా సుజనా చౌదరినే నియమించారు. చంద్రబాబుతో కలుపుకుని ఈ ముగ్గురినీ మన జాతీయ చిహ్నంలోని నాలుగు సింహాలతో పోల్చవచ్చేమో.. ముందువైపు చంద్రబాబు.. ఓ పక్క నారాయణ, మరో పక్క సుజనా.. కనిపించని నాలుగో సింహంగా సీఎం రమేశ్.. అదన్నమాట సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: