ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద క్లాసే తీసుకున్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వచ్చిందని మంత్రులను నిలదీశారాయన. త్వరలోనే మంత్రుల పనితీరుపై సమీక్ష జరుపుతానని. అందరితో ముఖాముఖీ చర్చిస్తానని స్పష్టం చేశారు. రెండు నెలల కాలానికి సంబంధించి ఆయా శాఖల పురోగతిపై నివేదికలివ్వాలని ఆదేశించారు. ఆ క్రమంలో పనితీరు మెరుగు పరుచుకోకుంటే ఇబ్బందులు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇసుక రీచ్-లు మహిళలకే కేటాయించే విషయమై ఏపి సీఎం చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు. కేబినెట్ మీటింగ్-లో ఆ విషయాన్ని స్పష్టం చేశారు. అలాగే కాపులను బిసిల్లో చేర్చేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నూతన ఐటి పాలసీకి ఈ కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్ టిటిడి పాలకమండలిని రద్దు చేయనుంది. ఈ నెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ – లో మూడు గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ తీసుకున్న నిర్ణయాలను ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వెల్లడించారు. విశాఖలో మెగా ఐటి హబ్ ఏర్పాటు, విజయవాడ, అనంతపురం, కాకినాడల్లో ఐటి హబ్-లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐటి పరిశ్రమలకు పలు రాయితీలు ప్రకటించారు. ఐటి కంపెనీలకు 25 శాతం పవర్ రాయితీ, 6 వేల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు 60 శాతం రాయితీ, ఐటి కంపెనీలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ మహిళలకు మరిన్ని రాయితీలు ఇవ్వనున్నారు. అలాగే అక్టోబరు 2 నుంచి గృహాలు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్తు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. రైతులకు ఏడు గంటల ఉచిత విద్యుత్ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. టిటిడి పాలకమండలి రద్దుకు కేబినెట్ నిర్ణయించింది. మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, వివిధ కార్పొరేషన్లకు ఉన్న పాలకమండళ్ల రద్దుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇసుక పాలసీపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. మహిళలకు ఇసుక రీచ్-లు కేటాయిస్తే వాటి నిర్వహణ, పర్యవేక్షణలో ఇబ్బందులుంటాయని కొందరు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే మహిళలకే ఆ బాధ్యతలు కట్టబెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంతి అక్రమాలు లేకుండా చూడటానికి ఇసుక రీచ్-లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేద్దామని సూచించినట్లు చెప్తున్నారు. మహిళలకు ఇవ్వాల్సిందేనని సీఎం స్పష్టం చేయడంతో ఇసుక రీచ్-లలో 25 శాతం మహిళా సంఘాలకు కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం లభించింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం కాపులను బిసిల్లో చేర్చడానికి కమిషన్ ఏర్పాటుకు ఏపి కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతమున్న బిసిలకు ఇబ్బంది లేకుండా కాపులను బిసీల్లో చేర్చేలా ఆ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఏపిలో 100 శాతం అక్షరాస్యతే లక్ష్యంగా హాజరు శాతం పెంచడానికి కాలేజీల్లో బయోట్రిక్ విధానం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి మధ్య మెట్రో రైలు ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్-సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ క్యాంటీన్లను పైలెట్ ప్రాజెక్ట్-గా మూడు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: