పీవీ నరసింహారావు.. ఢిల్లీ పీఠంపై తెలుగువాడి సత్తా ఏంటో నిరూపించినవాడు. దేశ ప్రధాని పీఠంపై కూర్చొన్న తొలి దక్షిణ భారతదేశానికి చెందిన నేత. ఓ మైనార్టీ సర్కారును ఐదేళ్లపాటు నడిపిన చాణక్యుడు. ఐదేళ్ల పాటు ప్రధాని పదవిలో కూర్చున్న.. గాంధీ-నెహ్రూ కుటుంబాలకు చెందని వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే.. పీవీ ఘనతలు ఇంకెన్నో.. రాజకీయాల నుంచి ఇక తప్పుకుందాంలే.. అనే సమయంలో ఆయనకు అనూహ్యంగా ప్రధాని పదవి లభించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. దేశాన్ని కొత్త బాటన నడిపించి శభాషనిపించుకున్నారాయన. పీవీ నరసింహారావుకు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు అంతగా పొసగేది కాదన్నది బహిరంగ రహస్యం.. అందుకు కారణాలు మాత్రం వెలుగులోకి రాలేదు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథతో ఈ అంశాలన్నీ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి. సోనియాతో తాను ఎంత సఖ్యంగా ఉన్నా.. ఆమె తనను దూరం పెడుతున్నారని అప్పట్లో పీవీ వాపోయారని నట్వర్ సింగ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ దశలో పీవీ సోనియాతో అమీ తుమీ తేల్చుకుందామనే అనుకున్నారట.. కానీ ఆ ప్రయత్నం విరమించుకున్నారట. ఇంతకీ సోనియాకు పీవీ అంటే ఎందుకు అంత కోపం.. ఈ విషయానికి సంబంధించి నట్వర్ సింగ్ చెబుతున్నదేమిటంటే.. రాజీవ్ గాంధీ హత్య కేసు విచారణలో జరిగిన జాప్యమే అందుకు కారణమని పరోక్షంగా వెల్లడించారు. సోనియా-పీవీల మధ్య విబేధాలు తీవ్ర స్థాయిలో ఉండేవని నట్వర్ చెబుతున్నారు. పీవీలోని మరో ఆసక్తికరమైన కోణాన్ని కూడా నట్వర్ వెల్లడించారు. పీవీ మేథావి.. నిరంతర అధ్యాయి, గొప్ప తాత్వికుడు అంటూనే ఆయనో జిత్తులమారి నక్క అని వర్ణించారు. అంతే కాదు.. పీవీ యోగిలా కనిపించినా.. నిజానికి ఆయన భోగి అంటూ ముక్తాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: