సీఎం కుర్చీ ఎక్కీఎక్కగానే మెట్రో రైలు ప్రాజెక్టుపై అంతెత్తున ఎగిరిపడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమంగా చల్లబడినట్టే కనిపిస్తున్నారు. హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలకు ఎలాంటి ముప్పు రాకుండా.. అసెంబ్లీ ప్రాంతంలో భూగర్భంలో మెట్రో మార్గం వేయాల్సిందేనని ఆయన మొదట్లో పట్టుబట్టారు. రెండు చోట్ల మెట్రో అలైన్ మెంట్ మార్చాలని హుకుం జారీ చేశారు. ఐతే.. పనులన్నీ దాదాపు చివరిదశకు చేరిన తరుణంలో ఆ పని చేయలేమని మెట్రో గట్టిగానే చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంతో ఓ దశలో అవసరమైతే మెట్రో ప్రాజెక్టుకు టాటా చెప్పేస్తామని కూడా ఎల్ అండ్ టీ సంస్థ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఏ పరిణామాలు జరిగాయో తెలియదు కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం క్రమంగా తన డిమాండ్లపై అంతగా పట్టుబట్టడం మానేసింది. ఇక్కడిదాకా వచ్చాక మొండిపట్టుపడితే భాసుపాలవుతామనుకున్నారో.. పారిశ్రామికవేత్తల్లో చెడ్డపేరు వస్తుందని వెనక్కు తగ్గారో తెలియదు కానీ టీఆర్ ఎస్ నేతల వైఖరిలో మాత్రం మెట్రో విషయంలో చెప్పుకోదగ్గమార్పు వచ్చింది. ఈమధ్య మెట్రో సీఎండీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెట్రో ఎలైన్ మెంట్ ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చేదిలేదని స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రస్తుతానికి 72 కిలోమీటర్ల మేరకు ప్రతిపాదించారు. హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా దీన్ని 250 కిలోమీటర్ల వరకూ పెంచాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు 2040 మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు. అంటే దాదాపు మూడు రెట్లు విస్తరణ ఉంటుందన్నమాట. అలాంటి సంస్థతో అనవసరం గా పేచీ పెట్టుకుంటే.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం భావించి ఉండొచ్చు. ఈ విషయంలో మెట్రో సంస్థ కూడా పట్టువిడుపు ధోరణి అవలంభిస్తోంది. చారిత్రక కట్టడాలకు ఎలాంటి ముప్పు రాకుండా.. ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని.. ఏదేమైనా అలైన్ మెంట్ మార్పుపై తుది నిర్ణయం కేసీఆర్ దేనని చెబుతున్నారు. మొత్తానికి ఈ విషయంలో ఇరు వర్గాలు ఓ అవగాహనకు వచ్చినట్టే కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: