నిబంధనల పేరుతో ప్రజలను వేధించుకుతినడంతో ప్రభుత్వ సంస్థల తర్వాతే ఎవరైనా.. ఏదైనా ఓ దరఖాస్తు పెట్టుకుంటే చాలు.. అవసరం ఉన్నా లేకపోయినా.. చాంతాడంత లిస్టు చెబుతారు. ఈ పత్రాలన్నీ సమర్పించాలంటారు. వాస్తవానికి అందులో నిజంగా అవసరం ఉండేవి కొన్నే. అదేమంటే రూల్స్ పేరు చెబుతారు. ఓ రకంగా ఇది హింసే. జనం కూడా ప్రభుత్వంతో వ్యవహారమంటేనే అంత అంటూ అలవాటు పడిపోయారు. వేరే దారి లేక.. తిట్టుకుంటూనే అడిగినవన్నీ సమర్పించుకుంటున్నారు. ఇది ఓ రకంగా ప్రభుత్వ సిబ్బంది లంచాలకు అవకాశం కల్పిస్తోంది. మోడీ సర్కారు ఈ నిబంధనల చట్రాన్ని సడలించబోతోంది. ప్రతి దానికీ గెజిటెడ్ అధికారులతో ధ్రువీకరణ చేయించే పద్దతికి స్వస్తి చెప్పనుంది. అంతేకాదు.. కొన్ని దరఖాస్తుల విషయంలో ఇప్పటివరకూ అఫిడవిట్ దాఖలు చేయడం తప్పనిసరిగా ఉండేది. ఇకపై ఆ అవసరం కూడా ఉండదు. సాధ్యమైనంతవరకూ గెజిటెడ్ ధ్రువీకరణలు, అఫిడవిట్లు సమర్పించే అవసరం లేకుండా చేయాలని మోడీ సర్కారు నిర్ణయించింది. అంతగా అవసరం అనుకుంటే.. సదరు దరఖాస్తుదారుడు సొంతగా ధ్రువీకరిస్తే సరిపోతుంది. కాకపోతే సొంత ధ్రువీకరణ తప్పుడుది అని తేలితే మాత్రం కఠినమైన శిక్షలు వేయాలని భావిస్తోంది. సొంత ధ్రువీకరణకు అంగీకరించినా.. ముగింపు దశలో మాత్రం ఒరిజినల్ పత్రాలు చూపించాల్సి ఉంటుంది. మోడీ తాజా నిర్ణయం అమలైతే జనం చాలా సంతోషిస్తారు. నిరుద్యోగులు ఓ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయదలచుకుంటే.. అప్లికేషన్ ఫారంలోనే సవాలక్ష పత్రాలు సమర్పించాలంటారు. లక్షల మంది దరఖాస్తుచేసుకుంటే.. ఇంటర్వ్యూ వరకూ వచ్చేది వందల సంఖ్యలోనే. అయినా దరఖాస్తు సమయంలోనే పత్రాల ధ్రువీకరణ కోసం ఒక్కొక్కరు వందల నుంచి వేల రూపాయలు ఖర్చు చేయాల్సివస్తోంది. ఇది ఒక్క నిరుద్యోగుల సమస్యేకాదు. దాదాపు సామాన్యులు ఏదో ఒక దశలో ఎదుర్కొనే సమస్య. మోడీ తాజా నిర్ణయంతో సామాన్యుడికి ఊరట లభించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: