తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పగ్గాల కోసం పోటీ పెరుగుతోంది. నిన్నటిదాకా బరిలో ఇద్దరుంటే, తాజాగా ఆ సంఖ్య నాలుగుకు చేరింది. రోజులు గడిచేకొద్దీ టీటీడీ చైర్మన్ పదవిని ఆశించే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ఏపీ సర్కారు తీర్మానించింది. దీనికి సంబంధించి శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆలయాల కమిటీలతో పాటు టీటీడీ పాలక మండలి కూడా రద్దైంది. గడచిన ఎన్నికల్లో టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి, చివరి నిమిషంలో నిరాకరణకు గురైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, తనకు బాబు రాతపూర్వకంగా హామీ ఇచ్చారని చెబుతున్నారు. వాస్తవంగా ఆయన వాదనలోనూ నిజముందనే భావన వ్యక్తమవుతోంది. అయితే టీటీడీ పదవిపై హామీతోనే పార్టీలో చేరినట్లు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వాదిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి టీటీడీ పదవి ఖాయమని నిన్నటిదాకా అందరూ భావించారు. అయితే ఉన్నట్టుండి మరో రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో కాస్త ముందుగా రేసులో నిలిచిన వ్యక్తి చిత్తూరు జిల్లాకు చెందిన నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కాగా, తాజాగా రాజమండ్రి ఎంపీ మురళిమోహన్, తానూ రేసులో ఉన్నానంటూ తెరపైకి వచ్చారు. గడచిన ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సినీ నటి, వైఎస్సార్సీపీ నేత రోజా చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ తనను కాదని టీటీడీ పదవి ఎక్కడికీ పోదని ఆయన ధీమాగా ఉన్నారు. అంతేకాక సీనియర్ నేతగా టీడీపీకి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు తర్వాత అన్నీ తానై చూసుకుంటున్నారు. ఇక తాజాగా బరిలో నిలిచిన మురళీమోహన్ ను అంత తక్కువగా అంచనా వేయలేం. గడచిన ఎన్నికల్లో చివరిదాకా మౌనంగా ఉండి, చివరి క్షణాల్లో రాజమండ్రి ఎంపీ సీటును దక్కించుకున్న మురళీమోహన్ కు చంద్రబాబు ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. తాజాగా బరిలో నిలిచిన ఆయనకు చంద్రబాబు మొండిచేయి చూపించడమనే సమస్యే ఉండదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూద్దాం మరి, ఈ రేసులో టీటీడీ పీఠం ఎవరిని వరిస్తుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: