ఎర్రబెల్లి దయాకర్ రావు.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కు. ఎన్నో ఆటు పోట్లను తట్టుకుని పార్టీని బతికించుకుంటూ వస్తున్నారు. సోదరుడు, బంధువులు వేరే పార్టీల్లోకి వెళ్లిపోయినా తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని నమ్మకంగా ఉన్న నేత. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లోనూ.. టీఆర్ ఎస్ విశ్వరూపం చూపుతున్న సమయంలోనూ.. చలించకుండా టీడీపీనే నమ్ముకున్న విశ్వాసం ఉన్న నేత. ఆయన కూడా పార్టీ ఫిరాస్తున్నాడని గతంలో వార్తలు వచ్చినా.. అవేవీ నిజం కాలేదు. కానీ.. స్వాంతంత్ర్య సందర్భంగా ఎర్రబెల్లి చేసిన ప్రసంగం మాత్రం వరంగల్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. కోరుకున్న తెలంగాణ వచ్చింది.. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందనుకోలేదంటూ ఆయన మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. గత ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో అధికారంలోకి రాదన్న సంగతి నిక్కర్లు వేసుకునే బుడ్డోడికి కూడా తెలుసు. ఆ విషయంలో అబద్దం చెప్పడం ఎందుకనుకున్నరో.. ఎర్రబెల్లి నిజమే మాట్లాడారు. అంతవరకూ ఓకే కానీ.. ఆ తరవాతే ఎర్రబెల్లి అనూహ్యమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కానీ టీఆర్‌ఎస్ కానీ అధికారంలోకి వస్తుందని ఊహించామని ఎర్రబెల్లి అన్నారు. ఆ తర్వాత.. అనుకున్నట్లే మంచి ప్రభుత్వమే వచ్చిందని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పడమే కాస్త విస్తుగొలిపింది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వమని ఎర్రబెల్లి అంటే.. టీఆర్ఎస్ విధానాలను సమర్థించినట్టే కదా.. మరి రోజూ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రభుత్వాన్ని విమర్శించడమెందుకని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఎర్రబెల్లి మాటల వెనుక వేరే రాజకీయ వ్యూహం కానీ.. పార్టీ మారే ఆలోచనగానీ ఉందా.. అని ఆలోచనలో పడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: