మొన్ననే ఎర్రచందనం పై వచ్చే డబ్బు ఏమైనా ఉంటే అది కేంద్ర ప్రభుత్వానికిచెల్లుంది కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు అని కస్టమ్స్ వాళ్లు స్పష్టం చేశారట. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకొన్న ఎర్రచందనం కలపను వేలం వేయగా వచ్చే డబ్బు కేంద్ర ప్రభుత్వ ఖాతాలో డిపాజిట్ చేస్తామని వారు వివరించారట. సీమాంధ్ర ప్రభుత్వం వెనవేల ఆశలు పెట్టుకొన్న ఎర్రచందనం విషయంలో కొత్త ఖబర్ ఏమిటంటే.. ఎర్రచందనం చెట్లను ప్రభుత్వం అధికారికంగా నరకాలంటే సవాలక్ష పర్మిషన్లు కావాలని సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో దగ్గర నుంచి అనేక పర్యావరణ అనుమతులు కావాలని, అలా చెబుతూ పోతే అనుమతుల కోసం ఐక్యరాజ్యసమితి వరకూ వెళ్లవలసి వస్తుందని అంటున్నారు. అత్యంత అరుదైన వృక్షాలుగా, విలువైన వృక్షాలుగు పేరు తెచ్చుకొన్న ఎర్రచందనం చెట్లపై చెయ్యి వేయలంటే ఐక్యరాజ్యసమితి అనుమతి కూడా ఉండాలని భోగట్టా. మరి ఇందులో నిజానిజాలు ఏమిటో కానీ... ప్రకృతి పరిరక్షణ విషయంలో కొంత కఠినంగానే ఉన్న ఐరాస అనుమతి నిజంగానే అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కష్టాలనే పడాల్సి వస్తుంది. ఆర్థిక వనరుల కోసం ప్రకృతిని ధ్వంసం చేయడానికి ఐరాస ఒప్పుకొంటుందా అనేది అనుమానామే. అభివృద్ధి పేరుతో అడవులు నరకడం వరకూ ఓకే కానీ.. ప్రభుత్వమే ఒక దలారీగా మారి డబ్బు కోసం చెట్లను నరికించడం నిజంగానే విషాదకరం అవుతుంది. అరుదైన వృక్ష జాతిని, అద్భుతమైన వృక్షజాతిని కాపాడుకోవాల్సిన ప్రభుత్వానికి దాన్ని నరకాలనే బుద్ధి పుట్టినా.. పర్యావరణ అనుమతులు మాత్రం అంత సులభం కాదని తెలుస్తోంది. ఒకవైపు స్మగ్లర్ల బారిన పడిన ఎర్రచందనం పోగా.. మిగిలినదాన్ని కొట్టుకొందామని ప్రభుత్వ పెద్దలు ఎనలేని ఆత్రుతతో ఉన్నారు. అలాంటి ఆత్రుతకు వరసగా వివిధ విభాగాల వారు అడ్డుపడుతున్నారు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎక్కడ వరకూ వెళుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: