ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందిన శివపై హైదరాబాద్ పరిధిలో 400లకు పైగా కేసులు ఉన్నాయని సైబరాబాద్ పోలీసుల కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. అనంతరం సీవీ ఆనంద్ మాట్లాడుతూ... నిందితుడు శివ నార్సింగ్లో తలదాచుకున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. దాంతో సెల్టవర్ ఆధారంగా అతడున్న ప్రాంతం గుర్తించి.... శంషాబాద్ సమీపంలో పోలీసులు నాకాబందీ నిర్వహించారని చెప్పారు. శివను తనిఖీ చేస్తున్న క్రమంలో ఎస్.ఐ. వెంకటేశ్వర్లుపై కత్తితో దాడి చేశారని... ఆత్మరక్షణ కోసమే వెంటనే స్పందించిన సీఐ నరసింహారెడ్డి కాల్పులు జరిపాడని సీవీ ఆనంద్ వివరించారు. ఎన్కౌంటర్ అనంతరం మృతుడు శివ అనుచరుడు జగదీశ్, అతడి భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. రెండు రోజుల క్రితం ఎల్బీనగర్లో శివ పోలీసులపై దాడి చేసి తప్పించుకున్నాడని ఆనంద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: