కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్టుగా ఉంది. పార్టీని తన చేతుల్లోంచి ఎవరైనా లాక్కెళ్లిపోతారేమో.. అనే భయం ఆమెను ఆవహించినట్టుగా ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ను ఒంటి చేత్తో ఆడిస్తున్న సోనియాగాంధీకి మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో దారుణమైన పరాజయం పెద్ద కుదుపుగా మారింది.అందులోనూ తన కుమారుడిని ప్రధానిని చేసుకోవాలని బావిస్తున్న తరుణంలో ఎదురైన ఓటమి.. అతడిని భవిష్యత్తును దెబ్బతీస్తుందని సోనియాగాంధీ లెక్కలేసుకొన్నట్టుగా ఉంది. మరి ఆ పరిస్థితిని నిరోధించాలంటే ఇప్పుడు ఎలాగైనా రాహుల్ గాంధీకి చెడ్డపేరు రాకుండా చేయాలి. అతడు భవిష్యత్తులో తిరిగి ప్రధానమంత్రిఅభ్యర్థిగా ప్రకటించబడాలి అంటే... ఇప్పటి నుంచినే అతడి కెరీర్ లో ఫెయిల్యూర్ లు లేవు అని నిరూపించాలి. అందుకే సోనియాగాంధీ వ్యూహాత్మకంగా ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా ఉంది. ఆంటోనీ కమిటీని తాజాగా ఇచ్చిన నివేదికలో పార్టీ ఓటమికి రాహుల్ గాంధీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది! మరి ఒకవేళ మొన్నటి ఎన్నికల్లోకాంగ్రెస్ గెలిచి ఉంటే... ఆప్పుడు విజయానికి వందశాతం రాహుల్ గాంధీనే కారణం అని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి రాహుల్ కూ ఓటమికి, ఓటమికీ రాహుల్ కు సంబంధం లేదని ఈ కమిటీ చెబుతోంది. మరి సోనియాగాంధీ కోరుకొన్నదీ ఇదే.. ఆంటోనీ కమిటీ చెబుతోందీ ఇదే! కథ సుఖాంతం. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం రాహుల్ గాంధీ కారణం కాదు అని తేల్చిన ఆంటోనీ కమిటీ ఇదే సమయంలో అసలు కారణం గురించి కూడా నివేదికలో పేర్కొంది! ఇంతకీ కాంగ్రెస్ ఓటమికి కారణమైనది మరెవరో కాదు మీడియా! మీడియా అతిగా నరేంద్రమోడీ గురించి ఫోకస్ చేయడం, కాంగ్రెస్ గురించి నెగిటివ్ ప్రచారం చేయడంతో కాంగ్రెస్ ఓటమి పాలయ్యిందట! ఇదీ కాంగ్రెస్ లెక్క!

మరింత సమాచారం తెలుసుకోండి: