ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య సయోధ్యకు గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ చొరవ తీసుకుం టున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్ర బాబునాయుడును, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఆదివారం మధ్యాహ్నం గవర్నర్‌ రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గవర్నర్‌ సమక్షంలో భేటీ జరగనుంది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, స్పీకర్లు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు గంట పాటు భేటీ జరుగుతుందని తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులకు గవర్నర్‌ విందును ఏర్పాటు చేసినట్లు సమాచారం. స్థానికత, ఫీజుల రీయిం బర్స్‌మెంట్‌, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, పోలవరం ప్రాజెక్టు, అసెంబ్లీలో భవనాల కేటాయింపు తదితర అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  రెండు రాష్ట్రాల నాయకులు, మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, రెచ్చగొట్టుకునేలా ప్రకటనలు చేయడం ఇటీవల పెరిగిన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో జరిగే ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు గవర్నర్‌ యత్నిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ ఇచ్చిన తేనేటి విందులో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇరువురు నేతలతో గవర్నర్‌ కొద్దిసేపు సంభాషించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యాన కర్నూలులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రధాన వేడుకలో చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు చర్చల ద్వారానే పరిష్కరిం చుకోవాలని, ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానిస్తున్నానని పేర్కొన్న విషయం తెలిసిందే. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలంతా ఒక్కటేనని, కలిసి ముందుకు సాగుతూ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని చంద్ర బాబు కోరిన విషయం విదితమే. ఈ పూర్వ రంగంలో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్యకు గవర్నర్‌ యత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: