పురపాలక శాఖ మంత్రి నారాయణ ఏముహూర్తంలో మంత్రి పదవి చేపట్టాడో కానీ.. పాపం సార్ చాలా బిజీ అయిపోయారు. ఒకటా రెండా.. చాలా కీలక బాధ్యతలు ఆయన నెత్తినే చంద్రబాబు పెట్టేశారు. సాధారణంగా మంత్రి పదవిలో సంబంధింత శాఖకు సంబంధించిన పనితో పాటు.. రాజధాని సలహా కమిటీ కూడా నారాయణకే అప్పగించారు కదా. ఇచ్చిన పనిని పర్ ఫెక్టుగా పూర్తి చేయడంలో దిట్ట అయిన నారాయణ.. ఇప్పుడు రాజధాని విషయంలోనూ అదే జోరు చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా విజయవాడను దాదాపుగా ఎంపిక చేయడంతో నారాయణ అందుబాటులో ఉన్న భవనాల పరిశీలనలో బిజీగా ఉన్నారు. రాజధాని ఎంపిక కమిటీ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులతో కూడిన బృందం ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం వివిధ భవనాలను పరిశీలించింది. వీటిలో గన్నవరం విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ఉన్న ఐటీ భవనం మేథా టవర్స్ తో పాటు విజయవాడ నగరంలోని మరో భవనం ఉన్నాయి. 30 ఎకరాల్లో నిర్మించిన మేథా టవర్స్ లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. ఇందులో ఇప్పటికే నాలుగు ఐటీ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా మిగిలిన భవనాలు అందుబాటులో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే చాలావరకూ సర్కారు కార్యాలయాలు ఇక్కడికి తరలించవచ్చని కమిటీ భావిస్తోంది. విజయవాడతో పాటు గుంటూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఖాళీస్ధలాల్ని, వ్యాపారసముదాయాల్ని, కొత్తగా నిర్మించిన భవనాల్ని కూడా నారాయణ కమిటీ పరిశీలించనుంది. వీటిలో లీజుకు తీసుకునే అవకాశమున్న వాటికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగనుంది. తాత్కాలిక రాజధానికి అవసరమైన భవనాల తరలింపు కోసం మొత్తం 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు అనుగుణంగానే పరిశీలన కొనసాగుతోంది. మరో వారం రోజులపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల పరిశీలన తర్వాత ముఖ్యమంత్రికి ఇచ్చే నివేదిక ఆదారంగా తాత్కాలిక రాజధానిపై స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: