ఒకనాడు పొత్తులతో చెట్ట పట్టాలేసుకున్న పార్టీలు టీడీపీ, సీపీఐ. ఇప్పుడు మాత్రం దూరంగా ఉన్నాయి. అయినా సీపీఐ నేతలు మాత్రం చంద్రబాబు పై విమర్శలు సంధించిన సందర్భాలూ చాలా అరుదు. మొన్నటిదాకా ప్రతిపక్షమే కదా అనుకుంటే... విభజన తర్వాత ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతా అదే పరిస్థితి కొనసాగింది. రుణమాఫీ విషయంలో బాబు ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత జగన్ విమర్శిస్తుంటే... సీపీఐ రాష్ట్ర నాయకులు మాత్రం జగన్ విమర్శలు సరికాదని గొంతెత్తారు. ఇప్పుడు మాత్రం అదే గొంతు మార్చి రుణమాఫీ విషయంలో బాబు ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రైతు రుణమాఫీ హామీపై ఏపీ సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదని సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు కె. నారాయణ అన్నారు. రైతు రుణమాఫీ ఫైలు పై చంద్రబాబు చేసిన సంతకం గడ్డపారను నానబెట్టాను... చూసుకోండి అన్నట్టుగా ఉందని తనదైన శైలిలో సెటైర్ ను సైతం పేల్చారు. అంతటితో ఆగకుండా రుణమాఫీ కోసం చంద్రబాబు ముక్కును నేలకు రాయించాలని అన్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడం చంద్రబాబు అదృష్టమంటూమరో చమత్కారమూ సంధించారు నారాయణ. వర్షాలు పడివుంటే ఈ పాటికి రైతులు ఖరీఫ్ ప్రారంభించేవారని... రుణమాఫీ కోసం ఎదురు చూపులు తప్పేవని ఆయన అన్నారు. నారాయణ విమర్శించిన రోజే... సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సైతం బాబు ప్రభుత్వం పై తీవ్ర విమర్శలే చేశారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ అంటూ ఓట్లేయించుకున్న చంద్రబాబు ... సీఎం పదవి చేపట్టి రెండు నెలలు అయిన రుణాలు మాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు. బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇస్తున్న బాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకపోతే ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రామకృష్ణ జోస్యం కూడా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: