మూడు నెల్ల క్రితం కొలువు దీరిన భారత ప్రధాని మోడీ... తన టీమ్ ను విస్తరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెలలోనే ఆ తతంగాన్ని పూర్తి చేసి ఆశావహులను అక్కున చేర్చుకునే దిశగా సాగుతున్నట్లు సమాచారం. పాత వారిలోనూ కొందరి శాఖల మార్పు ఖాయమనే వార్తలు గతంలోనే వచ్చినా... ప్రస్తుతానికి వాటి ప్రస్థావన ఉంటుందా... లేదా... అన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే విస్తరణ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్న ఎంపీలు మాత్రం ఇప్పటికే నమో ప్రసన్నం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. సొంత పార్టీ బీజేపీతోపాటు ఎన్డీయే మిత్రులైన టీడీపీ, అకాలీదళ్, శివసేన వంటి వాటికీ చోటు కల్పించే అవకాశం పుష్కలంగా ఉంది. బీజేపీ నుంచి ఇద్దరు రాజ్యసభ, ఇద్దరు లోక్‌సభ సభ్యులకు విస్తరణలో అవకాశం దక్కవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఒకరికి స్వతంత్ర మంత్రిత్వ శాఖను అప్పగించే అవకాశం ఉంది. సుజనాచౌదరి, సీఎం రమేశ్‌ ల పేర్లు టీడీపీ కోటాలో బలంగా వినిపిస్తున్నాయి. అయితే పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్న సుజనాచౌదరికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వినికిడి. బీజేపీలో జేపీ నడ్డా, ముక్తార్ అబ్బాస్ నక్వీ, భగత్‌సింగ్ కోషియార్, విజయ్ చక్రవర్తిల పేర్లు వినిపిస్తున్నాయి. శివసేన తరఫున ఎవరికి అవకాశం లభిస్తుందనేది స్పష్టం కాలేదు. రెండు శాఖలను ఆ పార్టీ కోరుతున్నా బీజేపీ మాత్రం ఒక్కదానితోనే సరిపెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 25 న నరేంద్ర మోడీ తన మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. కొత్తగా మంత్రివర్గంలో నిర్దిష్టంగా ఎంతమంది చేరుతారనేదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ... కొద్దిమంది ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖలను అదనంగా నిర్వహిస్తున్నారు. వారికి ఉన్న అదనపు బాధ్యతల భారాన్ని తొలగించి కొత్తగా చేర్చుకొనే మంత్రులకు ఆ శాఖలను కేటాయించే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వద్ద ఉన్న రక్షణ శాఖ, నితిన్ గడ్కరీ వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ లాంటివాటిని కొత్త మంత్రులకు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పనితీరు విషయంలో కొందరి పై అసంతృప్తితో ఉన్న మోడీ వారికి కూడా మార్పు రుచి చూపిస్తారేమో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: