ఒకే రోజులో 10 జిల్లాల్లో సమగ్ర సర్వే.. రాష్ట్రమంతటా ప్రభుత్వ సెలవు.. దుకాణాలు, సినిమా హాళ్లు, అన్నీ బంద్.. పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోవాలి.. ఇదీ తెలంగాణ సర్వే సృష్టిస్తున్న కలకలం. ఇంతకీ ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు.. ఇంత హడావిడిగా.. ఇంత కఠిన నిబంధనలతో.. ఒకేరోజు ఎన్నికల తరహాలో ఎందుకు చేస్తున్నారు.. దానికి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న కారణం సంక్షేమ పథకాల అమలు.. మరి ఇవేమీ చేయకుండానే గత ప్రభుత్వాలు పథకాలు అమలు చేశాయి కదా అంటే.. అందుకే ఆ పథకాలన్నీ అవినీతి పుట్టలుగా మారాయని సమాధానం చెబుతోంది తెలంగాణ సర్కారు. మరి నిజంగా తెలంగాణ సర్వే సంక్షేమ పథకాల కోసమేనా.. ఈ సర్వే వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవా.. ఈ సందేహాలన్నీ హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రుల్లో అలజడి సృష్టిస్తున్నాయి. వారి అనుమానాలు మరింత పెరిగేలా ఓ వీడియో అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి పీఆర్వో.. ఆంధ్రోళ్లను పంపించేందుకే ఈ సర్వే అన్నట్లుగా చూపుతున్న ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో స్థిరపడిన సీమాంధ్రకు చెందిన లక్షమంది విద్యార్థులు, 55వేల మంది ఉద్యోగుల సమాచారం సేకరించడమే ఈ సర్వే వెనుక ఉన్న అసలు లక్ష్యమంటూ పీఆర్వో ఆ వీడియోలో చెప్పారు. ఈ వీడియో టేపులను టీడీపీ తెలంగాణ నేతలు మీడియా ముందు ప్రదర్శించారు. సర్వేలో అడిగే ప్రశ్నలపైనా తెలంగాణ తెలుగుదేశం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్యాస్, సైకిల్ వంటి వివరాలు ఎందుకని.. ప్రశ్నించారు. జనాభా లెక్కలకే కేంద్రానికి ఏళ్లు పడుతుంటే.. ఒక్కరోజులో రాష్ట్రమంతటా ఎలా సర్వే చేస్తారని నిలదీశారు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: