హైదరాబాద్ లోని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడతా.. వారికి రక్షణగా ఉంటా... అని ప్రకటిస్తున్న తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా.. తమ ఏలుబడిలో ఉన్న రాయలసీమ ప్రజల ఆర్తనాదాలను పట్టించుకోవాలని కోరుతున్నారు ఆ ప్రాంత మేధావులు, ఆలోచనపరులు. రాష్ట్ర విభజన అనేది ఇంతటితో ఆగిపోవాలని... మరో డిమాండ్ తలెత్తకూడదనే భావనతో వాళ్లు చంద్రబాబు సీమపై దృష్టిసారించాలని వారు వారు కోరుతున్నారు. విభజన అనేది ఎలాగూ జరిగింది. ఇక అది ఇంతటితోనే ఆగాలని కోరుకొంటున్న మనుషులు, మనసులు చంద్రబాబు కు సిన్సియర్ రిక్వెస్ట్ చేసుకొంటున్నాయి. రాయలసీమను మరీ తోకలో ఈకలా తీసిపడేయకండి.. అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వయంగా రాయలసీమ వాడే అయినప్పటికీ ముఖ్యమంత్రి రాయలసీమ ను కించపరుస్తున్నట్టుగా మాట్లాడటం, రాజధాని విషయంలో రాయలసీమ వాసుల విజ్ఞప్తిని తక్కువ చేసి చూడటం సరైన పని కాదని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. కర్నూలును రాజధానిగా చేయాలనేది రాయలసీమ వాసుల కోరిక. మరి ఇది వారి కోరిక మాత్రమే కాదు... పెద్దమనుషుల ఒప్పందం అనబడు శ్రీబాగ్ ఒడంబడికలోనే కర్నూలుకు రాజధాని హోదా అనేది ఉంది. మరి ఇప్పుడు దాన్ని అమలు చేస్తే.. సీమాంధ్రుల కలయిక సవ్యంగా ఉంటుంది. లేకపోతే... మరో ప్రత్యేక ఉద్యమం వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగూ రాయలసీమ లో ఉన్నది ఏమిటో తెలిసిపోయింది. రాయలసీమలో విస్తరించి ఉన్న నల్లమల, శేషాచలం కొండల్లో ఎర్రచందనం నిల్వలు విస్తారంగా ఉన్నాయని.. వాటిని కొడితే కోట్ల కొద్దీ డబ్బు వస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. మరి తమ విలువ ఏమిటో రాయలసీమ ప్రజలకు తెలిసింది. తమకు సహజ సంపద ఉంది కాబట్టి... సొంతంగా నిలబడే శక్తి ఉందని వారికి ఈ పాటికే అర్థమైంది. ఈ పరిణామాల మధ్య ప్రత్యేక రాయలసీమ ఆకాంక్ష చాలా తొందరగా అల్లుకొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో కర్నూలులో రాజధాని కావాలంటే... ఎంతో చరిత్ర ఉన్న నగరాన్ని చంద్రబాబు నాయుడు కుప్పంతోనూ కుప్పతొట్టితోనూ పోల్చుతున్నారు. ఇది రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అంశమే. పైపెచ్చూ... రాయలసీమ లో రాజధాని డిమాండ్ ను వినిపిస్తున్న వారిని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ లోని ఆంధ్రులను రక్షించుకొంటానని అంటున్న బాబు.. రాయలసీమ ఆకాంక్షను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు?! అనేది దైవానికే తెలియాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: