రైతు రుణమాఫీ గురించి తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం రుణమాఫీ ఫైలు మీదే అన్న చంద్రబాబు హామీ ఏమయ్యిందో కానీ... పుల్లారావు గారు తాజాగా మాట్లాడుతూ.. రుణమాఫీ ఎప్పుడో చెప్పలేమని అనేశారు! నిన్నా మొన్నటి వరకూ మరో నాలుగు నెలల్లో రుణమాఫీ జరుగుతుందని తెలుగుదేశం వాళ్లే ప్రకటించినప్పటికీ ఇప్పుడేమో.. స్వయంగా వ్యవసాయ శాఖమంత్రి వర్యులు రుణమాపీ అనేది ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చే అంశం కాదని తేల్చేశారు! మంత్రిగారు ఇచ్చిన మరో ఉచిత సలహా ఏమిటంటే..తాహతు ఉన్న రైతులు వెంటనే రుణాలను చెల్లించేయమన్నారు! రైతులు బ్యాంకులకు లోన్లను చెల్లించేస్తే... తర్వాతి సంగతి తర్వాత చూసుకొందామని మంత్రిగారు పేర్కొన్నారు. మరి మంత్రిగారికి చాలా క్లారిటీనే ఉంది.. ఆయన చాలా ఈజీగా ఈ మ్యాటర్ ను తేల్చేసినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ రైతులకే ఏమీ బోధపడటం లేదు. ఇప్పటికే రైతులు బ్యాంకులకు మొహం చాటేశారు. కనీసం ఈ యేడాదిరుణాల రెన్యువల్ కూడా చేసుకోలేదు. దీని వల్ల వాళ్లు పంటబీమాకు కూడా అర్హత కోల్పోయారు. మాఫీఅయ్యే రుణాలను రెన్యువల్ చేయడం ఎందుకు? అనేది రైతుల ఆలోచన విధానం. మరి అలాంటి వాళ్లు ఇప్పుడు మంత్రిగారు చెప్పినట్టుగా తాహతు ఉన్నప్పటికీ రుణాలను చెల్లిస్తారని అనుకోలేం. ఓవరాల్ గా ఈ యేడాదికి రుణమాఫీ హామీ వల్ల రైతులకు పెద్ద దెబ్బే పడింది. నిక్కచ్చిగా వడ్డీలు కట్టి ఉన్నా.. వాళ్లకు పంటల బీమా అయినా దక్కేది. ఇప్పుడు మాఫీ కథ దేవుడు ఎరుగు.. బీమా కూడా లేకుండా పోయిందని రైతులు బాధపడుతున్నారు. మరి వారిని ఓదార్చేదెవరు?!

మరింత సమాచారం తెలుసుకోండి: