అవును నేను హిట్లర్‌నే. దొంగల పాలిట, తప్పుడు పనులు చేసేవారి పట్ల, అన్యాయం అరికట్టేందుకు హిట్లర్‌ తాత కంటే ఎక్కువ చేస్తా'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాలను సహించేది లేదని ఆయన హెచ్చరించారు. కెసిఆర్‌ హిట్లర్‌ లాగ వ్యవహా రిస్తున్నారని కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించడంపై ముఖ్యమంత్రి తన అధికార నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రంగా స్పందించారు. తప్పుడు లెక్కలు చూపిన వారికి, తప్పు చేసిన వారి పట్ల తాను నిత్యం హిట్లర్‌లాగే వ్యవహరిస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వం కొలువుధీరిన 60రోజుల్లోనే ఏదో ఆశించి ప్రజలు కోరని కోర్కెలను కూడా రాజకీయ నాయకులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వాల్లో సుమారు ఆరు నెలల వరకు ఎలాంటి సంక్షేమ పథకాలను ప్రారంభించేవారు కాదని, కానీ తమ ప్రభుత్వం రెండు నెలల కాలంలోనే పలు నిర్ణయాలనైనా తీసుకున్నామని వివరించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగితే సమాజంలో అసమానతలు తొలగి పేదరికాన్ని నిర్మూలించేందుకు అవకాశం ఉంటుందని, అంతరాలు తగ్గుతాయని, అందుకే తమ ప్రభుత్వం ఒక లక్ష్యం, గమ్యంతో మందుకెళ్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు అప్పుడే ఉబలాట పడుతున్నాయని, ఇంకా ఎన్నికలకు ఐదేళ్ల కాలపరిమితి ఉందని, ఎందుకు ఇప్పుడే చావు తెలివితేటలను ప్రదర్శిస్తున్నారని కెసిఆర్‌ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేపై రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యాలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు.  ప్రతి విషయానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తమాషా చేయొద్దని, జోకర్లుగా మిగిలిపోవద్దని ఆయన ఘాటుగా విమర్శించారు. అధికార పార్టీపై, కెసిఆర్‌పై ఆరోపణలు చేస్తూ తమ ఇమేజ్‌ను పెంచుకోవాలని కొందరు రాజకీయ నాయకులు పిచ్చి భ్రమల్లో ఉన్నారని, ఇది వారికే మంచిది కాదని ఆయన హితువు పలికారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టిడిపి, ఎల్లయ్య మల్లయ్యలకు ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చీకట్లో బాణం కొట్టదలుచుకోలేదని, లక్ష్యాన్ని చూసి బాణం వేయాలని భావిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రాష్ట్రంలో ఏమి ఉందో, ఏమి లేదో తెలుసుకోవడం ప్రభుత్వ హక్కు అని సిఎం చెప్పారు. సర్వే వెనకాల మరోక అంశం ఉందని, అంతర్గతంగా చేస్తున్నారని కొందరు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నారని, సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేశామని, ఇందులో రహస్యం ఏముందని ఆయన ప్రశ్నించారు. స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఉందని, 1956 సంవత్సరానికి పూర్వం ఉన్న వారే స్థానికులని, ఈ విషయాన్ని ఎప్పుడో ప్రకటించామని, ఇందులో ఎలాంటి రాజీ ఉండబోదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లనే ఇప్పుడు అనేక సమస్యలు వచ్చాయని, వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాష్ట్రంలోని కుటుంబాల కంటే రేషన్‌ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని, 22 లక్షల కార్డులు అధికంగా ఉన్నాయని, ఈ అంశం రాజకీయ నాయకులకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. రేషన్‌ కార్డుల విషయంలో గత పాలకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తెలంగాణలో ఆంధ్రవారిని గుర్తించడానికేనని కొంత మంది చేస్తున్న వాదన తప్పని సిఎం స్పష్టం చేశారు. గృహాల్లో ఎవరూ లేకపోతే ఎలా? హాస్పిటల్‌లో ఉన్న వారి పరిస్థితి ఎలా? అంటూ రకరకాల అనుమానాలను వ్యక్తం చేయడంలో వారి ఆంతర్యమేమిటని, ఇలాంటి వారి కోసం ఇబ్బందులు ఉండబోవని, అవసరమైతే హాస్పిటల్‌కు వెళ్తారని, అవసరాన్ని బట్టి మరోసారి సర్వే ఉంటుందని కెసిఆర్‌ చెప్పారు. అనర్హులను, అర్హులను గుర్తించే ఉద్ధేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కొందరు నానా యాగి చేస్తున్నారని, ఇది మంచి సంస్కారమా? ప్రజలు గమనించడం లేదా? అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వేతో చంద్రబాబునాయుడుకు సంబంధం లేదని, ఆయన ఎక్కడ పాల్గొనాలనే విషయం ఆయనే నిర్ణయించుకోవాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గోల్కొండ కోట విషయంలోనూ కొందరు ఇలాగే లేనిపోని రాద్ధాంతం చేయాలని ప్రయత్నించారని, కానీ రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేయడంతో ఏం చేయాలో పాలుపోలేదని, ఇప్పటికైనా రాజకీయ నాయకులు నిర్మాణాత్మకమైన సలహాలను ఇస్తే బాగుంటుందని సూచించారు. కోటలో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించడం ద్వారా కోటకు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి వెళ్లిందని, తద్వారా అంతార్జాతీయ పర్యాటకుల వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: