రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న చేపట్టే 'కుటుంబ సమగ్ర సర్వేవకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన ప్రజలు తెలంగాణకు చేరుకుంటున్నారు. జాతరను తలపించే విధంగా లక్షలాది మంది ప్రజలు స్వగ్రామాలకు పయనమ య్యారు. ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆచరణకు నోచుకోకపోవడంతో తెలంగాణకు వస్తున్న ప్రజల అవస్థలు వర్ణనాతీతం. రవాణా సౌకర్యం సరిపోకపోవడంతో కిక్కిరిసిన ప్రయాణాలు సాగిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌నుంచి ఉత్తర తెలంగాణకు వచ్చే రైళ్ళు కిక్కిరిసిపోతున్నాయి. బస్సుల్లోక ూడా సీట్లను అధిగమించి తమ సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ జిల్లాలకు చెందిన ప్రజలు వివిధ పనులు, ఉద్యోగరీత్యా మహారాష్ట్రలోని ముంబయి, గుజరాత్‌, సూరత్‌ వంటి ప్రాంతాల్లో నివాసముం టున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సమగ్రసర్వేకు ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ వాసులు తమ స్వగ్రామాలకు చేరుకొని సమాచారం అందించాలని పిలుపునివ్వడంతో స్వస్థలాలకు తరలివస్తున్నారు. ముంబయి, నయాముంబయి, బీవండి, సోలాపూర్‌, తదితర ప్రాంతాల్లో సుమారు 20 లక్షలు, గుజరాత్‌లోని సూరత్‌ ప్రాంతంలో దాదాపు 2 లక్షల మంది ఈ నాలుగు జిల్లాల వాసులున్నారు. గత నాలుగు రోజులనుంచి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తున్న వారు ఇప్పటికే తమ స్వగ్రామానికి చేరుకున్నారు. కంపెనీలు, వివిధ సంస్థలతో పాటు భవన నిర్మాణరంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఒక్కసారిగా పెద్దసంఖ్యలో తెలంగాణ ప్రజలు తమ సొంత ఊర్లకు పయనమైనందున అందుకు సరిపడా రవాణా సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు నాలుగు రైళ్ళు వస్తున్నప్పటికీ ప్రస్తుత తరుణంలో అవి సరిపోవడం లేదు. అదేవిధంగా ఆర్టీసి బస్సులతోపాటు రోజువారి ప్రయివేటు బస్సులు కూడా వేలాదిమందిని తెలంగాణ జిల్లాలకు చేరుస్తున్నాయి. బస్సులు, రైళ్ళు, ఇతర వాహనాల్లో రవాణా సరిపోకపోవడంతో ముంబయి నుంచి నేరుగా ప్రయివేటు బస్సుల్లో జిల్లాలకు వస్తున్నారు. ఇప్పటివరకు ఉత్తర తెలంగాణలో 50 శాతం స్వగ్రామానికి చేరుకున్నారు. అదనపు రవాణా సౌకర్యాలు ఏర్పాటుచేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, సర్వే సమయం దగ్గరపడుతున్నా ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో అనివార్య పరిస్థితిలో ప్రయివేటు వాహనాల్లో రాక తప్పడం లేదని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ముంబయి వాసులు పేర్కొంటున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రయివేటు ట్రావెల్స్‌ యజమానులు ఒక్కసారిగా ముంబయి నుంచి నిజామాబాద్‌ మీదుగా జగిత్యాల వరకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణం రోజుల్లో 900 రూపాయలు ఛార్జీ ఉండగా, ప్రస్తుతం 1500 నుంచి 2 వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముంబయిలోని తెలంగాణ ప్రజలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమ పిలుపును ముంబయి, ఇతర ప్రాంతాల్లో అమలు చేశారు. తెలంగాణ సాధన అనంతరం రాష్ట్రంలోనే తాము నివాసాలుండాలనే ధృడమైన కోరిక కూడా వలస ప్రజల్లో నెలకొని ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు మారుతాయన్న భరోసాతో కొత్త ప్రభుత్వం, కొత్త తరహాలో దేశంలోనే మొట్టమొదటిసారిగా చేపట్టే కుటుంబ సమగ్ర సర్వేలో తమవివరాలు పొందుపరుచుకోవడానికి వ్యయప్రసాలకోర్చి సొంతూళ్ళ చేరుకుంటున్నారు. ముంబయి నుంచి బయల్దేరుతున్న బస్సులు నిజామాబాద్‌ చేరే సరికి కిక్కిరిసి పోతున్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు వెళ్లడానికి స్వతాహాగా వాహనాలు ఏర్పాటు చేసుకొని వెళ్తున్నారు. నిజామాబాద్‌ - వరంగల్‌ వెళ్లే ఆర్టీసి బస్సులను జాతరను తలపించే విధంగా వెనువెంటనే అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రాంతాలనుంచి తెలంగాణ జిల్లాలకు చేరుకుంటున్న వారికోసం ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో అవసరమగు వాహనాలు కూడా సమకూర్చాలి. ఆదివారం ముంబయి నుంచి వచ్చే రైళ్లకు అదనంగా బోగీలు జతచేయాలని కోరుతూ ముంబయి జెఎసి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం కూడా అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: