అన్నం పెట్టే రైతన్నలు వలస కూలీలుగా మారుతున్నారు. వ్యవసాయానికి సాగునీరు అందకపోవడంతో పొట్ట చేతబట్టుకొని పట్టణాలకు వలస వెళుతున్నారు. అలాంటి వారి సంఖ్య ఉత్తరాంధ్రలో రోజురోజుకూ పెరిగిపోతోంది. పట్టణ ప్రాంతాల్లో పనులు దొరక్క.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖలోని ఎన్ఎడీ జంక్షన్, సీతమ్మపేట, ఈనాడు సర్కిల్.. కూలీలకు కేరాఫ్ సెంటర్లు. ప్రతి నిత్యం సుమారు మూడు వేల మంది కూలీలు.. పనుల కోసం పడిగాపులు కాస్తారు. విశాఖలో పదికి పైగా కూలీల అడ్డాలున్నాయి. దాదాపు 50వేలకు పైగా వలస కూలీలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. విశాఖలో కూలిబాట పట్టిన వారిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులతో పట్టణ ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ప్రతిరోజూ ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం ఏడు గంటల నుంచి కూలీ పని కోసం ఎదురుచూస్తుంటారు. పని దొరికితే ఓకే.. లేదంటే ఆరోజు వారి మనుగడ కాస్త కష్టమే. వ్యవసాయం వదిలి కూలీలుగా మారిన రైతన్నలకు రోజు గడవడం కష్టంగా మారుతోంది. ఎంతకష్టపడ్డా నెల ఆదాయం పదివేల రూపాయల లోపే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పని దొరుకుతుందన్న నమ్మకం లేదంటున్నారు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: