తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి బీటలు వారుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఖమ్మం జిల్లాలో మాత్రమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపితో పాటు మూడు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. ముగ్గురిలో ఒకరు వైఎస్‌ఆర్‌సిపి శాసనసభాపక్ష నేతగానూ, మరొకరు ఉపనేతగాను, మరొకరు విప్‌గాను ఉన్నారు. ఇక ఎంపి పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా తదనంతరం పరిణామాలతో ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం పార్టీ నేతల్లో రోజురోజుకీ సన్నగిల్లుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రధాన కార్యక్రమాలను చేపట్టకపోవటంతో పార్టీలోని నేతలంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంలోని కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు తెరాస వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు ఇప్పటికే టిఆర్‌ఎస్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపి, పార్టీలో చేరికపై ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయనతో పాటు ఒకరిద్దరు ఎంపిపిలు, జడ్పీటిసిలు, పది మందికిపైగా సర్పంచ్‌లు కూడా టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ఒకరు పార్టీ మారితే అనర్హత వేటు పడదని, కాబట్టి పార్టీలో చేరవచ్చని తెరాస నేతలు సూచించినట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలకు ముందుముఖ్యమంత్రి కెసిఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని, అప్పుడు పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరతారని తెరాస నేతలు చెబుతున్నారు. జిల్లాలో బలహీనంగా ఉన్న తెరాసను ఏడాదిలోగా బలమైన పార్టీగా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: