కేసీఆర్ వ్యతిరేకుల జాబితాలో ఇప్పుడు మరో వర్గం చేరింది. కేసీఆర్ తాజా నిర్ణయాలతో వారికి ఆయనపై పీకల దాకా కోపం వస్తోంది. ఇంతకీ ఏంటా వర్గం అనుకుంటున్నారా.. వారే ఇంజనీరింగ్ కళాశాలల యజమానులు. ఔను మరి.. ఒకటా రెండా.. ఏకంగా లక్షకు పైగా ఇంజినీరింగ్ సీట్లను తెలంగాణ సర్కారు కోతపెడుతోంది. సరైన సదుపాయాలు లేవంటూ ఏకంగా 170కుపైగా కళాశాలలకు అనుమతులు నిరాకరిస్తోంది. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో సగానికిపైగా మూతపడనున్నాయి. మరి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తోంది..? ఈ ప్రశ్నకు ఆదివారం సీఎం కేసీఆర్ బదులిచ్చారు. ఇంజినీరింగ్ సీట్ల కోతతో నాకేం సంబంధమంటూ గదమాయించారు. ఆ పని చేసింది జేఎన్ టీయూసీ.. దానికి నేనేం చేయాలని ఎదురు ప్రశ్నించారు. నిజమే.. ఆ పని చేసింది జేఎన్ టీయూసీనే.. కారణం.. సదరు ఇంజినీరింగ్ కళాశాలల్లో సదుపాయాలు సరిగ్గా లేవని. అలాంటి కాలేజీల్లో చదివి ఇంజినీర్లై రేపు వంతనలు కూలగొడితే ఎవడిది బాధ్యత అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. వింటానికి ఈ వాదన బాగానే ఉంది. కానీ కళాశాలల యజమానుల వాదన మరోలా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బరువు తగ్గించుకొనేందుకే సర్కారు ఇలాంటి చర్యలు తీసుకుంటోందని తెలంగాణ ప్రైవేటు ఇంజనీరింగ్‌, ప్రొఫెషనల్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం ఆరోపించింది. ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయం అంటూ అడ్మిషన్ల ప్రక్రియనే నిలిపివేసే దిశగా ఆలోచిస్తామని హెచ్చరించింది. కాలేజీల్లో లోపాలు ఏమైనా ఉంటే చెబితే సరిచేసుకుంటాం.. కానీ మొత్తం కాలేజీనే మూసేయమంటే ఎలా ప్రశ్నిస్తున్నారు కళాశాల యజమానులు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బకాయి రూ.1300 కోట్లు చెల్లించాల్సి ఉందని.... ఆ నిధులను విడుదల చేయకుండా కాలేజీలను ఇబ్బంది పెట్టడం మంచిదికాదని కళాశాలల యజమానులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పనిచేసే 25 వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. న్యాయపోరాటానికి వారంతా సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: