దళిత గిరిజన ఓటు బ్యాంకుపై కొంతకాలంగా దృష్టిపెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆయా వర్గాలకు మరో తాయిలం ప్రకటించారు. ఇప్పటికే దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన కేసీఆర్.. మార్కెట్ కమిటీ చైర్మన్లలో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. వీరితో పాటు బీసీలకూ ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీలకు 22 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని... వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ఆమోదింపజేసి అమలుచేస్తామని కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ల విషయంలోనే కాకుండా... యూనివర్సిటీ పాలక మండళ్ల్లలో కూడా ఎస్సీ, ఎస్టీలు 22 శాతం ఉండేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్ల నియామకంలో, సెనెట్లలో, కార్యనిర్వాహక కమిటీల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన పోస్టులు కేటాయించాలని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం అవసరమైతే నిబంధనలను సవరించి శాసనసభలో ఆమోద ముద్రవేస్తామన్నారు. ఇప్పటివరకూ సంక్షేమ పథకాల తరహాలోనే తాయిలాలిచ్చిన ప్రభుత్వాలు.. ఇప్పుడు వాటిని యూనివర్శిటీల విషయంలోనూ వర్తింపజేయడం విశేషమే. దళిత బాలికల చదువుల విషయంలోనూ కేసీఆర్ ఉదారత ప్రదర్శించారు. పట్టణ ప్రాంతాల్లో చదువుకోవడానికి వచ్చే దళిత విద్యార్థినులకు సరైన వసతులు లేక చదువు మానేస్తున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్నత చదువుల కోసం ఎస్సీ బాలికలు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ గదులు అద్దెకు తీసుకొని ఉండాలంటే ఇబ్బందులు పడుతున్నారని, దీనితో చదువు మానేయడం..డ్రాపవుట్స్ పెరగడం జరుగుతున్నదన్నారు. అందుకే కళాశాల స్థాయిలో విద్యను అభ్యసించే దళిత విద్యార్థినుల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ బాలికల హాస్టల్ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించినట్టు కేసీఆర్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: