రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేశారని సీఎం చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ నిలదీసింది. చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం మాని వాస్తవ లోకంలోకి రావాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శనివారం సూచించారు. అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే ఇంత చేయగలగుతానని ఎవరైనా ఊహించారా అంటూ చంద్రబాబు స్వాతంత్య్ర దినోత్సవం రోజు విలేకరుల వద్ద మాట్లాడిన మాటలు ఆశ్చర్యకరమన్నారు. కనీసం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఐదు తొలి సంతకాలైనా అమలు చేయగలిగారా అని ప్రశ్నించారు. ‘‘రైతుల రుణాలు మాఫీ చేసి తీరుతామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. ఆయన తీరు చూస్తే ఏడాది తరువాత కూడా ఇదే మాట చెప్పేలా ఉన్నారు’’ అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మాటల్లోనే రుణాల మాఫీకి మరో 4 నెలలు పడుతుందని తెలుస్తోందని, తొలి సంతకం అమలుకే ఆరు నెలలు పడితే ఆ సంతకం చేసిన సీఎంకు విలువేమి ఉంటుందని ప్రశ్నించారు. కొత్త రాజధానిపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకముందే గుంటూరు - విజయవాడల మధ్య రాజధాని అంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని, తద్వారా ఎన్నికల సమయంలో డబ్బు సాయం చేసిన వారి భూముల ధరలు భారీగా పెరిగేందుకు మాత్రం దోహదపడుతూ అవే గొప్పగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అంబటి రాంబాబు, రైతుల రుణాలు మాఫీ, chandrababu naidu, YSR congress party, Ambati Rambabu, farmers loan waiver scheme

మరింత సమాచారం తెలుసుకోండి: