ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే హత్యా రాజకీయాలపై అసెంబ్లీ దద్ధరిల్లి పోయింది. సోమవారం సభ ప్రారంభంకాగానే రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చించాలంటూ వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించారు. దీంతో వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. వాయిదా అనంతరం... ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష వైఎస్ జగన్ మాట్లాడారు. మూడు నెలల్లో 11 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కిరాతకంగా చంపేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఏ చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని అడిగితే... తమకు సమాధానం ఏమి లభించలేదని జగన్ అన్నారు.  హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలతో బతుకుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు స్పీకర్ కోడెల నేతృత్వంలో జరిగే బీఏసీ సమావేశానికి హాజరుకాబోమని నిన్నటి వరకు చెప్పిన వైఎస్సార్సీపీ తన మనసు మార్చుకుంది. సోమవారం జరిగిన బీఏసీకి ఆ పార్టీ అధినేత జగన్ స్వయంగా హాజరయ్యారు. బీఏసీలో వైకాపాకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై ఈ సందర్భంగా ఆయన అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా అవతరించిన పార్టీకి బీఏసీలో సరైన ప్రాతినిథ్యం కల్పించడం లేదని జగన్ నిరసన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: