మంగళవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న సర్వేపై ప్రజలకు భయాందోళనలు, ఎన్నెన్నో అనుమానాలు నెలకొన్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో ఉండి సర్వేలో వివరాలను నమోదుచేసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలు వారికి అందబోవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో సర్వేపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను, అనుమానాలను తీర్చడానికి ఏపీహెరాల్డ్ వ్యూవర్స్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. మంగళవారం రోజున ఇంటి వద్దకు ఎన్యుమరేటర్ వచ్చి ఈ వివరాలు అడుగుతారు. ఆ వివరాలను కచ్చితంగా అందజేసి విధిగా సంతకం చేయాలి. యజమాని లేదా సభ్యులు ఎన్యుమరేటర్ ధ్రువీకరించిన పత్రాన్ని చదివిన అనంతరమే సంతకం చేయాలి. అయితే ఈ సర్వేలో ముగ్గురికి మాత్రమే మినహాయింపునిచ్చారు. మిగతా కుటుంబ సభ్యులంతా కచ్చితంగా ఇంటి వద్దనే ఉండి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు, ప్రసవించడానికి పుట్టింటికెళ్లిన గర్భిణులు, చదువు నిమిత్తం హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులకు వీరు సర్వే రోజు ఇంటి వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ వారికి సంబంధించి కచ్చితమైన ఆధారం చూపించాలి. అప్పుడే ఎన్యుమరేటర్ సర్వేలో వారి వివరాలు నమోదు చేస్తారు. రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే అడ్మిషన్ కాగితాలు, గర్భిణి ఆమె గతంలో తీసుకున్న వైద్యం వివరాలు, విద్యార్థి ఏ హాస్టల్‌లో ఉంటున్నారో ఐడెంటీ కార్డు చూపించాలి. మొత్తం 10 విభాగాల్లో 80కిపైగా అంశాలను ఈ సర్వే ద్వారా ఎన్యుమరేటర్ ప్రతి కుటుంబం నుంచి సేకరించనున్నారు. కుటుంబంలో భార్యాభర్తలు ఎన్యుమరేటర్‌గా సర్వేలో పాల్గొంటే 20న వారు నివసించే ప్రాంతంలో నోడల్ అధికారి దగ్గర వివరాలు నమోదు చేయించుకోవాలి. ఇప్పటికే అన్ని ఇళ్లకు వేశారు. ఒక వేళ ఇంటి నెంబర్ వేయకపోతే వెంటనే స్థానిక తహసీల్దార్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నెంబర్ వేయించుకోవాలి. * ఏదైనా సందేహం ఉంటే 1800-425-1442 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవాలి. * సర్వే రోజున ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చే సమయానికి ఇంటి వద్దే ఉండి ఈ కింద చెప్పిన ప్రతుల సమాచారం కచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి. 1. ఇంటి యజమానితో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నెంబర్లు 2. రేషన్ కార్డు (తెలుపు/పింక్/అన్నపూర్ణ/ అంత్యోదయ) 3. బ్యాంకు ఖాతా నెంబర్ 4. పోస్టాపీస్ ఖాతా నెంబర్ 5. మొబైల్ నెంబర్ 6. గ్యాస్ కనెక్షన్ వివరాలు మరియు నెంబర్ 7. పింఛను పుస్తకం (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత) 8. సొంత వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్, వివరాలు 9. వయసు ధృవీకరణ పత్రాలు (పిల్లలు చదువుకున్నవారైతే) 10. ఓటర్ ఐడీ నెంబర్లు (18 సం.లు పైబడినవారు) 11. వికలాంగుల ధుృవీకరణ పత్రాలు (సదరం సర్టిఫికెట్, ఎలాంటి వైకల్యం) 12. వ్యవసాయ భూమి వివరాలు (పాస్‌బుక్‌లు/టైటిల్ డీడ్స్) 13. పశుసంపద వివరాలు 14. సొంత స్థిర, చరాస్తుల వివరాలు 15. దీర్ఘకాలిక వ్యాధుల వివరాలు 16. విద్యుత్ కనెక్షన్, మీటర్ నెంబర్భుత్వం నిర్ణయించింది. * సర్వేపై సందేహాలు - సమాధానాలు సందేహం: కుటుంబసభ్యులు పలు కారణాల వల్ల ఆ రోజున ఇంట్లో లేకపోతే పరిస్థితి ఏమిటి? సమాధానం: దీనికి కచ్చితమైన ఆధారం చూపించాల్సి ఉంటుంది. సందేహం: ఎన్యుమరేటర్‌కు అన్ని వివరాలు చెప్పాల్సిందేనా ? సమాధానం: అవును చెప్పాల్సిందే. వారు చెప్పిన వివరాలను ఆధార్‌కార్డుతో సరిపోల్చుతారు. డుప్లికేషన్‌కు ఆస్కారం లేకుండా భవిష్యత్తులో బ్యాంకు ఖాతాల నెంబర్లతో సరిచూసుకుంటారు. సందేహం: గిరిజనులు ఉపాధి కోసం అడవుల్లో సంచరిస్తుంటారు.. వారి నమోదు ప్రక్రియ ఎలా ఉంటుంది? సమాధానం: నివాస స్థలాలు(హాబిటేషన్స్) ఎక్కడ ఉంటే అక్కడికి సర్వే సిబ్బంది తప్పనిసరిగా వెళతారు. సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండి ప్రతి కుటుంబంలోని వ్యక్తుల పేర్లను నమోదు చేస్తారు. సందేహం: సంచార జాతులు ఒక చోట స్థిరనివాసం ఉండరు.. అలాంటి వారిని ఏవిధంగా పరిగణలోకి తీసుకుంటారు ? సమాధానం: సర్వే జరిగే రోజున వారు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే వారి వివరాలను నమోదుకు చర్యలు తీసుకోవాలని సర్వే యంత్రాంగానికి ఖచ్చితమైన ఆదేశాలు జారీచేస్తున్నాం. సందేహం: అత్యవసర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు ఇంటిలో ఉండలేరు కదా? సమాధానం: ఇలాంటి ఉద్యోగులకు సంబంధించిన వివరాలు వారి కుటుంబసభ్యులు తగిన ఆధారాలతో చూపిస్తే సరిపోతుంది. సర్వే సిబ్బంది కూడా అంగీకరిస్తారు. సందేహం: ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న రోగులను నమోదు చేసుకుంటారా? సమాధానం: ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నట్లుగా ఆధారాలను కుటుంబసభ్యులు చూపిస్తే సరిపోతుంది. సందేహం: కుటుంబసభ్యులందరూ ఉండాల్సిందేనా ? సమాధానం: అనివార్య కారణాల వల్ల కుటుంబసభ్యులు అందుబాటులో లేనిపక్షంలో అందుకు గల కారణాలు, వాటికి సంబంధించిన ఆధారాలను చూపించి కుటుంబసభ్యుల్లో ఒకరు పూర్తి వివరాలను వెల్లడిస్తే సరిపోతుంది. సందేహం: ఇంటికి తాళం వేసి ఊరికెళ్లిన వారి సంగతేంటి? సమాధానం: సర్వే రోజున ఇంటికి తాళం వేసినట్లుగా ఎన్యుమరేటర్ గుర్తించి నమోదు చేస్తారు. ఆ తర్వాత ఇంటి కుటుంబ సభ్యులు సర్వే రోజున ఎందుకు అందుబాటులో లేరు..? ఎక్కడికి వెళ్ళారు..? అనే వివరాలను ఆధారాలతో పాటు నిర్ధారించాల్సి ఉంటుంది. సందేహం: మానసిక వికలాంగులు, మతి స్థిమితం లేని వారి పేర్లను కూడా నమోదు చేసుకుంటారా? సమాధానం: పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా అందరి వివరాలు, అన్ని వివరాలు నమోదు అవుతాయి. సందేహం: సర్వే కోసం ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడుకుటుంబసభ్యులందరూ ఇంట్లో ఉండాల్సిందేనా ? సమాధానం: అవును, ఆరోజున ఇంట్లో ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటారు. సందేహం: సర్వే జరుగనున్న 19వ తేదీన ప్రైవేటు సంస్థలు సెలవు ప్రకటించకుంటే పరిస్థితి ఏమిటి? సమాధానం: తెలంగాణ పది జిల్లాల్లో ప్రైవేటు సంస్థలు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాల్సిందే. ఈ మేరకు కార్మిక ఉపాధి శాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జారీ అవుతాయి. సందేహం: ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ర్టాల్లో, విదేశాల్లో ఉన్న వారి సంగతేమిటి? సమాధానం: ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటే వారిని పరిగణనలోకి తీసుకోరు. అయితే పై చదువుల కోసం వేరేచోట ఉంటే అదికూడా ఒక సంవత్సరంలోపు వారు తిరిగి ఆ కుటుంబంలోకి వస్తారనే ఆధారం చూపగలిగితే వారి పేరును నమోదు చేసుకుంటారు. సందేహం: ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ ప్రైవేటు ఉద్యోగుల మాటేమిటి? సమాధానం: ప్రైవేటు ఉద్యోగులైనా తప్పకుండా ఆ రోజున అందుబాటులో ఉండాల్సిందే. సందేహం: అయితే వారికి సెలవు మాటేమిటి? సమాధానం: ప్రతి జిల్లా కలెక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. సర్వే రోజును అధికారికంగా అన్ని ప్రైవేటు సంస్థలకు సెలవు ఇవ్వాల్సిందే. సందేహం: ఒకే ఇంట్లో వేర్వేరు కాపురాలతో ఉన్న వారిని వేర్వేరు కుటుంబాలుగా గుర్తిస్తారా ? సమాధానం: ఒక ఇంట్లో ఒకే వంటగది ఉంటే వారంతా ఒకే కుటుంబంగా రికార్డు చేస్తారు. ఎన్ని వంట గదులుంటే అన్ని కుటుంబాలుగా గుర్తించి నమోదుచేస్తారు. సందేహం: ఆర్థిక పరిస్థితులను ఎలా అంచనా వేస్తారు? సమాధానం: ఎన్యుమరేటర్‌కు విలేజ్ సర్వెంటు, వీఏఓలు సహాయకారులుగా ఉంటారు. వారు ఒకొక్క కుటుంబ జీవన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులపై అవగాహన కలిగిఉంటారు. కుటుంబసభ్యులు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినా వాటిని బేరీజు వేసుకుంటారు. సందేహం: ఎన్యుమరేటర్ నమోదులోనే పొరపాట్లు ఉంటే ? సమాధానం: ఎన్యుమరేటర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే స్థానికంగా ఉండేవారిని కాదని వేరే ప్రాంత ఉద్యోగులను ఎంపిక చేస్తున్నారు. వారికి రెండు రోజుల పాటు తగిన శిక్షణ కూడా ఇస్తారు. సందేహం: సర్వే నమోదుషీట్‌ను వెంటనే అందించనట్లయితే.. సమాధానం: దీనికి ఆస్కారమే ఉండదు. అదే రోజు సాయంత్రానికి తమ వద్ద ఉన్న అన్ని పత్రాలను అంటే భర్తీ చేసినవి, భర్తీ చేయనివి కూడా గ్రామ ప్రత్యేక అధికారికి ఎన్యుమరేటర్ అందజేయాలి. గ్రామ స్పెషల్ ఆఫీసర్ అదేరోజు రాత్రి వాటిని మండల కేంద్రానికి అందజేస్తారు. సందేహం: సర్వే చేయాల్సిన ఇండ్లను ఎన్యుమరేటర్లకు ఏ విధంగా కేటాయిస్తారు ? సమాధానం: ఇటీవలే గ్రామ పంచాయతీ, మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలు జరిగినందున వాటి ఓటరు జాబితాల ఆధారంగా కుటుంబాలను ఎంపిక చేస్తారు. ఒక్కొక్క ఎన్యుమరేటర్‌కు ఇరవై నుంచి ముప్పై ఇండ్లను మాత్రమే కేటాయిస్తారు. ఒక సారి ఒక ఎన్యుమరేటర్ ఆ ఇంటికి వెళ్ళి వచ్చాక తిరిగి మరొకరు వెళ్ళకుండా ఆ ఇంటికి ప్రభుత్వం రూపొందించిన స్టిక్కర్‌ను ఆరుబయట అతికిస్తారు. సందేహం: ఈ సర్వే ఫార్మెట్‌లోని వివరాలను భవిష్యత్తులో మార్పులు, చేర్పులు చేస్తే ఎలా? సమాధానం: అందుకనే వచ్చిన అన్ని ఫార్మెట్‌ల వివరాలను ఒకవైపు కంప్యూటర్లలో నమోదుచేయడంతోపాటు ఫార్మెట్‌లన్నింటినీ స్కానింగ్ చేసి భద్రపరుస్తారు. జేపీజీ ఫార్మాట్‌లో వాటిని భద్రపరచడం వల్ల ఎలాంటి మార్పుచేర్పులకు ఆస్కారం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: