'టీవీ 9, ఏబీఎన్ లు ఏమైనా మీ మనోభావాలను నొప్పించి ఉంటే.. వారి తరపున మేము క్షమాపణలు అడుగుతున్నాం... క్షమించండి. ఆ చానళ్ల ప్రసారాలపై నిషేధం ఎత్తి వేయండి..' అంటూ అసోసియేటివ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ ఎమ్ ఎస్ వోలకు విజ్ఞప్తి చేసుకొంది. ఇలా సారీ చెప్పి కూడా కొన్ని గంటలు గడిచిపోయాయి. అయినా ఎమ్ ఎస్ వోలు ఆ రెండు న్యూస్ చానళ్లపై ఆగ్రహావేశాలను తగ్గించుకోవడం లేదు. వాటి ప్రసారాలపై నిషేధాన్ని ఎత్తివేయడం లేదు! దీంతో ఆ రెండు చానళ్లకూ మరోసారి ఆశాభంగం అయ్యింది. ఇప్పటికే ఎమ్ ఎస్ వోలపై ఆ చానళ్లు తమ పరపతిని ఉపయోగించుకొని చాలా రకాలుగా ఒత్తిడి తీసుకు వచ్చాయి. కోర్టు అయ్యింది... కేంద్ర ప్రభుత్వం ద్వారా హెచ్చరికలు జారీ చేశారు... పార్లమెంటులో చర్చను పెట్టారు.. అయినా ఎమ్ ఎస్ వోలను మాత్రం లొంగదీసుకోలేకపోయారు. కొన్ని రాజకీయ పార్టీ లు ఆ చానళ్ల పునఃప్రసారానికై చాలా కష్టపడుతున్నాయి. అయితే ఆ ప్రయాస కు తగ్గ ఫలితం కనపడటం లేదు. ఎమ్ఎస్ వోలకు కేంద్ర సమాచార శాఖ మంత్రి చేత హెచ్చరిక జారీ చేయించారు. అయినా వాళ్లు వెనక్కు తగ్గకపోవడంతో తాజాగా ఏబీసీ ద్వారా క్షమాపణలు చెప్పించారు. హెచ్చరికలు, క్షమాపణలు అనే రెండు రకాల అస్త్రాలనూ వాడేంత తెలివి తేటలు చూపిస్తున్న ఆ చానళ్ల పాలిట ఎమ్ ఎస్ వోలు సింహస్వప్నంగా మారారు. వాటిని టెలికాస్ట్ చేసేదిలేదని స్పష్టం చేస్తున్నారు. మరి సామదానబేద దండోపాయాలు ఉపయోగించినా ఫలితం కనపడటం లేదు. మరి చానళ్ల పరిస్థితి ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: