తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతలాగానే వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయాలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. అధికారం చేతిలో ఉన్నప్పుడు చేయాల్సింది చేయకుండా చంద్రబాబు నాయడు గతంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ గురించి విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని విమర్శలు చెలరేగుతున్నాయి. శ్వేత పత్రాల పేరుతో చంద్రబాబు పరనింద, ఆత్మస్తుతికి ప్రాధాన్యం ఇస్తున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన పరిణామాలపై చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశాడు. కాంగ్రెస్ అక్రమంగా రాష్ట్రాన్ని, అడ్డగోలుగా విభజన చేసిందని బాబుగారు చెబుతున్నారు. మరి అప్పుడు మీరేం అయిపోయారు సారు? విభజన బిల్లుకు తొలి ఓటు వేసిన ఎంపీ కూడా టీడీపీ వాళ్లే కదా? ఆ విషయాన్ని గట్టిగా బయటకు చెప్పుకొన్నది కూడా మీ వాళ్లే కదా? అని మనం అడగకూడదు. అలా అడిగితే బాబు కు కోపం వస్తుంది. కోపం వస్తే చరిత్ర చెప్పుకొస్తారు! రాష్ట్ర విభజన పరిణామాలపై శ్వేత పత్రం విడుదల చేసినప్పుడు కూడా బాబు తనదైన శైలిలోనే మాట్లాడారు. హైదరాబాద్ ను నేనే అభివృద్ది చేశాను.. ఐటీ ప్రాజెక్టులను నేనే తీసుకొచ్చాను.. అంటూ తన రొటీన్ శైలినే కొనసాగించారు. నేనే.. నేనే... నేనే... అంటూ ఆత్మస్తుతి చేసుకొన్నారు. తాను తప్ప ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ప్రతివాళ్లూ వెధవలేనని బాబు చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఈ శ్వేతపత్రాల వ్యవహారం గురించి ఇప్పటికే అధికారులు వివరణ ఇచ్చారట. వీటితో ప్రయోజనం లేదు.. ఇవి జనాల్లోకి వెళ్లేవి కాదు. అనుకూల మీడియాలో ఒక రోజు రాసుకోవడానికి పనికి రావడమే తప్ప.. మరో ఉపయోగం లేదని అధికారులు ముఖ్యమంత్రికి తేల్చి చెప్పారట. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎవరి మాటా వినలేదని భోగట్టా. తన మటుకు తాను గత ప్రభుత్వాలను విమర్శించుకొంటూ ఉండటానికే ఆయన ప్రాధాన్యతను ఇస్తున్నాడట. మరి ఆ ప్రభుత్వాలపై ప్రజలు కక్ష తీర్చుకొన్నారు. ఇక వారి గురించి వగచి ఏం ప్రయోజనం అనేదే ఇక్కడి ధర్మ సందేహం!

మరింత సమాచారం తెలుసుకోండి: