టీడీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మేల్యేలతో చంద్రబాబు మీటింగ్ హాట్ హాట్ గా సాగింది. సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు... పార్టీ కోసం కృషిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపునివ్వాలని సూచించారు. రాష్ట్రవిభజన అనంతర పరిణామాలు, పాలనా పరిస్థితులపై కేసీఆర్ తో చర్చించానని ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మేల్యేలకు వివరించారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలంతా నిర్ణీత సమాయానికి రావాలని బాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి గైర్హాజర్‌ కావద్దని సూచించారు. సభలో ప్రతిపక్ష తీరును గమనిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కోరారు. మొదటి నుంచి కార్యకర్తల రుణం తీర్చుకుంటానని పదే పదే చెప్పే బాబు వారిని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు చెప్పారు . అదే సమయంలో పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు బాబు. కష్ట పడిన పార్టీ శ్రేణులకు గుర్తింపునిచ్చే లక్ష్యంతో మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీలతో సహా నామినేటెడ్ కమిటీల్లో కార్యకర్తలకే పెద్దపీఠ వేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. సొంత అభిప్రాయాలకంటే పార్టీకోసం పనిచేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఏపీలో తమ ప్రభుత్వం వచ్చింది ....పాలన అంతా మనదే సాగుతుందన్న అభిప్రాయం కింది స్థాయిలో లేదని బాబుకు వివరించారు పార్టీ ఎమ్మెల్యేలు. గ్రామస్థాయి కేడర్ నుంచి పై స్థాయి అధికార యంత్రాంగం దాకా ప్రక్షాళన చేపట్టాలని బాబు దృష్టికి తీసుకెళ్ళారు. దీనికి సానుకూలంగా స్పందించిన బాబు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు బాబు. విస్తృత పర్యటనలు చేసైనా ప్రజలతో సత్సంబంధాలు పెంచుకొని పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. ముఖ్యంగా ఆదివారం జరిగిన చర్చలో కేసీఆర్ వైఖరిలో మార్పు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇరు రాష్ట్రాల్లో అభివృద్ధి ఖాయమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: