తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన జీవితంలో తొలిసారి విదేశాలకు వెళ్తున్నారు. ఆయన సీఎం హోదాలో మంగళవారం రాత్రి ఇక్కడి నుంచి బయలుదేరి సింగపూర్‌ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌ సింగపూర్‌కే కాదు.. విదేశాలకు వెళ్తుండటం కూడా ఇదే మొదటిసారి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌.. గతంలో ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ విదేశాలకు వెళ్లలేదని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముఖ్యులు మీడియాకు తెలిపారు. 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన తర్వాత అనేకసార్లు ఆయనకు వివిధ దేశాల నుంచి ఆహ్వానాలు అందాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న నేతగా తమ వద్దకు రావాలని ఆయా దేశాల్లోని తెలంగాణ వా దులు పలుమార్లు అభ్యర్థించారు. అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఆయన విదేశాలకు వెళ్లటం కుదరలేదు. 1982 నుంచి ప్ర త్యక్ష రాజకీయాల్లో ఉన్న కేసీఆర్‌ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విదేశీ పర్యటనకు వెళ్లకపోవటం విశేషమే. ఇన్నాళ్లకు.. అదీ సీఎం హోదాలో కేసీఆర్‌ తొలిసారి విదేశీ పర్యటకు వెళ్తుండటం మరో విశేషం. కాగా, ఆయన వెంట మంత్రి ఈటెల రాజేందర్‌, పలువురు అధికారుల బృందంతోపాటు, చాలా మంది పార్టీ ముఖ్య నేతలు సింగపూర్‌ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌కు అన్నీ తామై పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలమునకలైన బృందం కూడా సింగపూర్‌ పర్యటనకు వెళ్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: