విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలపై తెదేపా అధినేత చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో విశాఖ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు పరోక్షంగా మద్దతు పలికారు. ఆయన మంత్రివర్గ సహచరులు కూడా తవ్వకాలను సమర్థిస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని, అలాగే గిరిజనుల జీవనానికి విఘాతం కలుగకుండా చూస్తామని తెదేపా నేతలు చెబుతున్నారు. చంద్రబాబు విపక్షనేతగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ 2011 డిసెంబర్ 24న అప్పటి గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజన మనోభావాలు దెబ్బతింటున్నాయని లేఖలో పేర్కొన్నారు. 2011 డిసెంబర్ 21, 22 తేదీల్లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ ఏజెన్సీకి వెళ్లినప్పుడు అక్కడి గిరిజనులు మారణాయుధాలతో కమిటీని అడ్డుకున్నారని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్న కిశోర్ చంద్రదేవ్ కూడా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. అల్యూమినా కంపెనీల ఏర్పాటుకు జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా తమాషాగా సాగిందని పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాల వల్ల విశాఖ, విజయనగరం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి లభ్యతకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆయన అన్నారు. 2000లో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకోపోగా, వాటిపై కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టించారని చంద్రబాబు పేర్కొన్నారు. 2000లో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలపై స్పందించిన అప్పటి గవర్నర్ రంగరాజన్ గిరిజనుల హక్కులు కాపాడాలని సూచించారని, దాంతో ఆనాడు బాక్సైట్ తవ్వకాలను విరమించుకున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. చట్టవ్యతిరేకంగా జరగనున్న బాక్సైట్ మైనింగ్‌ను అడ్డుకోవాలని చంద్రబాబు 2011లో గవర్నర్ నరసింహన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఐ, సిపిఎంతో కలిసి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. అలాగే స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు కూడా దీన్ని వ్యతిరేకించడంతో కేంద్రంలోని యూపీఏ, రాష్ట్రంలోని రాజశేఖరరెడ్డి ప్రభుత్వాలు బాక్సైట్ తవ్వకాలపై దూకుడు తగ్గించాయి. తరువాత కేంద్ర ప్రభుత్వమే బాక్సైట్ తవ్వకాలకు పర్యావరణ అనుమతి ఇవ్వడానికి కూడా కాస్త వెనుకంజ వేసింది. అప్పటి కేంద్ర మంత్రి, అరకు ఎంపీ కిశోర్ చంద్రదేవ్ కూడా గవర్నర్ నరసింహన్‌కు సుమారు ఏడాది కిందట లేఖ రాసి, ఆయనకున్న విశేష అధికారాలను ఉపయోగించి తవ్వకాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో బాక్సైట్ తవ్వకాలకు బ్రేక్ పడింది. 2002లోనే బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనను విరమించుకున్న చంద్రబాబు, ఈమధ్య అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ దానిపై దృష్టి సారిస్తున్నారు. గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లకుండా, వారికి ఆదాయం చేకూరే విధంగా వ్యవరిస్తామంటూ చంద్రబాబు చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విశాఖ జిల్లాలో ఈనెల 8, 9 తేదీల్లో పర్యటించిన ఆయన చల్లారిన బాక్సైట్ చిచ్చును మరోసారి రగిల్చివెళ్లారు. బాక్సైట్ తవ్వకాల వల్ల వచ్చే అనర్థాలను ఆయన మరోసారి సమీక్షించాలని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: