తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక్కరోజు సమగ్ర సర్వే నేడు నాన్ స్టాప్ గా కొనసాగనుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ మహా సర్వే రాత్రి 8 గంటల వరకు విరామం లేకుండా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 13 గంటల పాటు ఏకధాటిగా రాష్ట్రమంతటా సాగనున్న సకల జన సమగ్ర సర్వే జనమంతా స్వస్థలాలకు చేరుకున్నారు. మారు మూల పల్లెల నుంచి మెట్రోపాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ వరకూ అంతటా ఇవాళ సర్వే ఫీవరే కనిపిస్తోంది. ఏ ఇద్దరు కలిసినా కాదు... ఒంటరిగా ఉన్న వారు కూడా సర్వే గురించే అంతరంగంలో ఆలోచిస్తున్నారు.  హైదరాబాద్ తో సహా మొత్తం తెలంగాణ పది జిల్లాల్లో కలిపి 99 లక్షల 41 వేల కుటుంబాలున్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి ఇప్పటికే ప్రీ విజిట్ సర్వేలో నంబరింగ్ ఇచ్చారు. వాటి ఆధారంగా ఎన్యుమరేటర్లు వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. సుమారు ఈ కోటి కుటుంబాల సమగ్ర సమాచారం రాబట్టడం కోసం 3 లక్షల 69 వేల మంది ఎన్యుమరేటర్లు పని చేస్తున్నారు. పలు దఫాలుగా శిక్షణ పొందిన వీరి పని తీరును నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ తో పాటు ప్రత్యేక ఐఏఎస్ అధికారులనూ సర్వే నిమిత్తం ప్రభుత్వం నియమించింది. ఒక్కో జిల్లాకు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారులు సర్వే తీరును పర్యవేక్షించనున్నారు. సర్వేలో సమాచారం నమోదు చేయించుకోవడం కోసం తరలి వెళ్లడంతో... పట్టణాలన్నీ బోసిబోయి దర్శనమిస్తున్నాయి. సమగ్ర సర్వే రోజున సకలం బంధ్ అవుతాయన్న కేసీఆర్ మాట... టౌన్ లలో ఏ సంధును చూసినా నిజమే అనిపిస్తోంది. సోమవారం రోజే చాలా మంది సొంత ప్రాంతాలకు బయల్దేరడంతో ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలతో ఎదుర్కొన్న రవాణా సమస్యలు అన్నీ ఇన్నీ కావు.

మరింత సమాచారం తెలుసుకోండి: