ఏపీ రాజధాని బెజవాడ-గుంటూరు మధ్య అని డిసైడైపోయింది. కార్యాలయాల తరలింపు మొదలైంది. తాత్కాలిక ప్రాతిపదికన కార్యాలయాల కోసం వెదుకులాట మొదలైంది. 3నెలల్లో తాత్కాలిక రాజధాని విజయవాడలో ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. బెజవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధాని చేయడానికి ఏపీలో ఎక్కువ శాతం మొగ్గుచూపుతున్నారు. కాకపోతే.. రాజధాని ఏర్పాటు ఇక్కడ అత్యంత ఖరీదైన వ్యవహారం. భూముల ధరలు ఆకాశాన్ని తాకేలా ఉండటమే అందుకు అసలు కారణం.         రాజధాని కోసం కనీసం 15వేల ఎకరాల భూమైనా కావలన్నది ఓ అంచనా.. కానీ బెజవాడ-గుంటూరు మధ్య ఎకరం అప్పుడే పది కోట్ల రూపాయల విలువ దాటింది. సర్కారు లెక్క ప్రకారం భూమి కొనాలన్నా వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ప్రభుత్వ భూమి పెద్దగా అందుబాటులో లేదు. ఈ తరుణంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వినుకొండ మండలం కొత్తపేటకు చెందిన రైతు ధూళిపూడి రఘుపతిరావు రెండు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కలెక్టర్ ను కలసి.. ఈ మేరకు లేఖ అందజేశారు.   రెండు ఎకరాల భూమి అంటే ఇప్పటి ధర ప్రకారమే దాదాపు 20 కోట్ల రూపాయలు.. ముందు ముందు ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. భూమిని బంగారంగా భావిస్తున్న తరుణంలో రాష్ట్రం కోసం.. రాజధాని కోసం ఆ రైతు అంత విలువైన భూమి త్రుణప్రాయంగా భావించి విరాళంగా ప్రకటించడం సాధారణ విషయం కాదు. రాజధాని గా బెజవాడ-గుంటూరు ప్రాంతం ఖరారవుతుందన్న విషయం తెలియగానే వందల ఎకరాలు కొనుగోళ్లకు తెరతీసిన నేతలు.. ఈ రైతును చూసైనా బుద్ది తెచ్చుకోవాలి. సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు.. త్యాగం అంతకంటే గొప్పదని తెలుసుకోవాలి. ఈ రైతు బాటలోనే సాగితే.. రాజధాని కల సాకారం కావడం పెద్ద కష్టం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: