మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను నిలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోందట కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రతిపాదనపై పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చ జరిగిందట. ఐసీసీ పరిశీలకుడు ఆర్‌సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఒక ప్రతిపాదన వచ్చిందని సమాచారం. కేసీఆర్ ఎంపీ సీటుకు చేసిన రాజీనామాతో... మెదక్ ఎంపీ సీటుకు ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఈ ఎత్తు వేస్తోంది. గత ఎన్నికల్లో ఉద్యోగులంతా టీఆర్‌ఎస్ పక్షాన నిలిచి గెలిపిస్తే కేసీఆర్ మాత్రం కోదండరాంను పక్కనపెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని ఆయనను ఇలా వాడుకోవాలని కాంగ్రెస్ వాళ్లు భావిస్తున్నారు. మరి కోదండరాం కాంగ్రెస్ కు ఈ విధమైన అస్త్రం అవుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. మెదక్ ఉప ఎన్నికల్లో కోదండరాం ను నిలబెడితే.. మొదట ఇబ్బందుల్లో పడేది టీఆర్ఎస్ పార్టీనే! తెలంగాణ ఉద్యమకారుడికి టికెట్ ఇచ్చామని కాంగ్రెస్ వాళ్లు చెప్పుకొనే అవకాశాలుంటాయి. అప్పుడు టీఆర్ఎస్ ఎవరిని పోటీలో పెట్టినా... పోటీ తీవ్రం అవుతుంది. ఇక బీజేపీ, టీడీపీ వాళ్ల అభ్యర్థులు కూడా కోదండరాం ముందు దిగదుడుపే అవుతారు. అయితే ఇక్కడ ప్రధానమైన సందేహం ఏమిటంటే... కోదండరాం కాంగ్రెస్ కు సహకారం అందిస్తాడా? అనేది!ఒకవేళ కోదండరాం పోటీపై ఆసక్తి చూపితే మాత్రం మెదక్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతుందనడంలో సందేహం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: