ఈ పాటికి ఎంపీ అయిపోయి హ్యాపీగా ఢిల్లీలో మకాం పెట్టేసేవాడు రేవంత్ రెడ్డి.. ఒకవేళ చంద్రబాబు అప్పుడే మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను కేటాయించి ఉంటే ... రేవంత్ రెడ్డి అలా సెటిలయ్యేవాడు. అయితే అప్పట్లో తెలుగుదేశం అధినేత ఈ రెడ్డిగారిపై దయ చూపలేదు. మరి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి కోరిక నెరవేరుతుందా?! అనేది ఆసక్తికరంగా మారింది.   మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఉందన్న తన కోరికను బయటపెట్టుకొన్నాడు రేవంత్ రెడ్డి. మీడియా కనిపిస్తే.. తన కోరికను బాబుకు కూడా విన్నవించుకొన్నాననిరేవంత్ రెడ్డి వివరించాడు. మరి ఎంపీ అయిపోవాలన్న తీవ్రమైన కోరిక కలిగిన రేవంత్ రెడ్డికి ఇప్పుడైనా ఆ ఆశ నెరవేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ కోసం అయితే రేవంత్ రెడ్డి బాగా కష్టపడగల వ్యక్తి. కేసీఆర్ పై విరుచుకుపడాలన్నా... జగన్ పై విరుచుకుపడాలన్నా.. రేవంత్ రెడ్డి చాలా ముందుంటాడు. భవిష్యత్తులో తెలంగాణలో పార్టీకి చుక్కానిలా మాట్లాడలనేంత స్థాయి లో ఆశలున్నాయి ఆయనకు. అందుకు తగ్గట్టుగా ఆయన వ్యూహ ప్రకారం ముందుకు వెళదామని అనుకొంటున్నాడు. అయితే అందుకు చంద్రబాబు నుంచి ఇప్పటి వరకూ ఏ మాత్రం సహకారం లభించడం లేదు.   మరి ఇప్పుడైనా రేవంత్ రెడ్డికి బాబు అవకాశం ఇస్తాడా? మెదక్ లో టీడీపీకి ఉన్న విజయవాకాశాలు అంతంతమాత్రమే.. టీఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య ఇక్కడ తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. మరి బాబు కూడా ఈ సీటును బీజేపీకి వదిలిపెట్టే అవకాశాలే ఎక్కువ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినా తెలుగుదేశానికి విజయంపై పెద్దగా ఆశలు లేని ఈ సీటును అయినా రేవంత్ కు ఇస్తారా? లేక..రేవంత్ ఎదుగుదల మీద తనకు పెద్దగా ఇష్టం లేదన్న విషయాన్ని బాబు చాటుకొంటాడా? అనేది ఇక్కడ అభ్యర్థి ఎవరనే అంశాన్ని బట్టి తేలిపోతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: