టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి జగన్ పార్టీ నేతలపై రెచ్చిపోయారు. అసెంబ్లీలో ఆ పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర చరిత్ర ఉన్న వారే నేరాల గురించి మాట్లాడటమేంటన్నారు. అది దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఏటీఎం దొంగలు, ఎర్రచందనం స్మగర్లు తమపై ఆరోపణలు చేస్తారా.. అంటూ వెటకారం ఆడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతుల్లో వ్యవహరించడం తగదని సూచించారు. అసెంబ్లీ వాయిదా తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ ప్రభుత్వంలో చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోలేరని, రౌడీయిజం అన్న మాట గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ లేదని, ఇప్పుడూ ఉండబోదని స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఉంటే..ప్రజలు ఊళ్లలో ఉండలేని పరిస్థితి వచ్చేదని అన్నారు. ప్రజలకు ఈ విషయం తెలిసే తెదేపాకు అధికారం కట్టబెట్టారన్నారు. హత్యారాజకీయాలపై... నిన్న 19 మందని, నేడు 11 మందంటూ పూటకోలెక్క చెబుతున్నారని... విమర్శించారు. పరిటాల రవి హత్య సమయంలో తనకు కనీసం అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదన్న విషయం గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. శాసనసభను తామే శాసించాలనుకోవడం వైకాపాకు తగదన్న చంద్రబాబు... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతుల్లో వ్యవహరించడం తగదని సూచించారు. సభ్యుడు మాట్లాడేటప్పుడు అడ్డంగా నిల్చొని ప్లకార్డులు కెమెరాకు అడ్డుపెడుతూ అసెంబ్లీలో చొక్కాలు పట్టుకునే పరిస్థితి తీసుకురావడం గౌరవప్రదమా అని ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టేందుకు ప్రయత్నిస్తే..10మంది చనిపోయారని వివరణ ఇచ్చారు. వారిని వదిలిపెడితే .. తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా కబ్జా చేస్తారని.. అలాంటి వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: