రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాల వివరాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఇందులో కేంద్ర హోంమంత్రిత్వశాఖ జోక్యం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సర్వే విషయంలో ఎలాంటి జోక్యం చేసుకున్నా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వైఖరి తప్పేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తున్నదని హోంమంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. సర్వే వల్ల ఉత్పన్నమయ్యే పరిస్ధితులను నిశితంగా పరిశీలిస్తున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే సీమాంధ్ర ప్రజల్లో అనుమానాలు, భయాం దోళనలు రేపిందని, అందుకే కేంద్రం కూడా పరిస్థితులను గమనిస్తున్నదని పేర్కొన్నారు. అవసరమైతే, కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని ఆ అధికారి వెల్లడించారు. తెలంగాణలో ప్రత్యేకించి ఉద్రిక్తంగా వున్న హైదరాబాద్‌లో పరిస్థితులు ప్రశాంతంగా వుంటాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగబోవని ఆశిస్తున్నది. 'తెలంగాణలోనూ, హైదరాబాద్‌ లోనూ మంచి వాతావరణం నెలకొంటుందని మేము భావిస్తున్నాం. ఉద్రిక్తతలు తలెత్తేలా తెలం గాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగబోదని విశ్వసిస్తున్నాం' అని కేంద్ర హోంశాఖ అధికారి వ్యాఖ్యానించారు.  సీమాంధ్ర ప్రజలను గుర్తించేం దుకే సర్వే నిర్వహిస్తున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. లక్ష్యిత వర్గా లకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరవేసేందుకే సర్వే నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) వెబ్‌సైట్‌లో పోస్టు చేసిన చెక్‌స్లిప్‌లో పలు ఆధారాలు చూపించాలని పేర్కొన్నది. కుటుంబ సభ్యులు ఎంతమంది? వాటర్‌ ట్యాప్‌ కనెక్షన్‌, ఆస్తి పన్ను అంచనా, ఎల్‌పిజి, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్‌, బ్యాంక్‌ అకౌంట్‌, ఆధార్‌ కార్డు, కులధృవీకరణ సర్టిఫికెట్‌, బర్త్‌ సర్టిఫికెట్‌, వాహనాలు, భూముల వివరాలు వంటివి చెప్పాలని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల బాధ్యతలను గవర్నర్‌కు కట్టబెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని నిందించింది. కేంద్రం ఆదేశాలు శిరసావహించేది లేదని తేల్చిచెప్పింది. గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలను ఫాసిస్టు చర్యగా కెసిఆర్‌ అభివర్ణించారు. కేంద్రానికి ధిక్కార లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: