బీజేపీ కొత్త అధ్యక్షుడు అమిత్ షా పార్టీ విస్తరణపై దృష్టి సారించారా...? మోడీ , అమిత్ షాల జోడీ తక్షణ కర్తవ్యం పార్టీని దేశవ్యాప్తంగా నలు చెరగులా వ్యాప్తి చేయడమేనా...? దక్షిణాదిలో కమలనాథుల మొదటి టార్గెట్ తెలంగాణాయేనా...? అవుననే అంటున్నారు కమలనాథులు. అధ్యక్షుడిగా మొట్ట మొదటి కార్యకర్తల సమావేశానికి అమిత్ షా ...తెలంగాణాని ఎంచుకోవడానికి కారణం అదేనంటున్నాయి ఢిల్లీ లోని బీజేపీ వర్గాలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా టీమ్ ఇప్పుడు దాని విస్తరణపై దృష్టి సారించారు. పార్టీ బలహీనంగా ఉన్న తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు, దక్షిణాది రాష్ట్రాల్లోనూ బలం పుంజుకోవడానికి తగిన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో 2019లో తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత.. అమిత్ షా మొట్ట మొదటి కార్యకర్తల సమావేశం తెలంగాణాలోనే ఏర్పాటు చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి.. పార్టీ శ్రేణులకి దిశా నిర్దేశం చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఇదే సరైన సమయమని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లలో ప్రస్తుత రాజకీయ వాతావరణం.. ఒక కొత్త రాజకీయ పార్టీ ఎదిగేందుకు అవకాశం కల్పించేలా ఉందని సీనియర్లు అంచనా వేస్తున్నారు. అందులోనూ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కలిగి ఉన్న తెలంగాణాలో ఆ అవకాశాలు మరింత మెండుగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడం... టీడీపీకి ఆంధ్ర పార్టీ అనే ముద్ర ఉండడంతో... అధికార టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం తమకే ఉందన్నది కమలనాథులు బలంగా నమ్ముతున్నారు. కాబట్టి టార్గెట్ 2019 కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించనున్నారు అమిత్ షా. రాజకీయ వ్యూహాలు రచించడంలోనే కాదు వాటిని అమలు పరచడంలో కూడా దిట్టని పేరు తెచ్చుకున్న అమిత్ షా ....తెలంగాణా మీద ప్రత్యేక దృష్టి సారించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపు పాతిక సంవత్సరాల తరవాత యూపీలో పార్టీకి తిరుగులేని వైభవాన్ని తెచ్చిన అమిత్ షా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో అదే సీన్ ను రిపీట్ చేయగలుగుతారా..? వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: