సమాజ్ వాదీ పార్టీ మాజీ నాయకుడు, పార్టీ అధినేత ములాయం సింగ్ కు ఒకప్పటి ఆప్త మిత్రుడు.... అమర్ సింగ్. పార్టీ నుంచి వెలివేతకు గురై రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమర్... తిరిగి పాత పార్టీలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాజకీయ చతురతతోపాటు సత్సంబంధాలు నెరుపుటలోఅమర్ సింగ్ కు తిరుగు లేదు. అందుకే యూపీలో తన కొడుకు అఖిలేష్ చేతుల్లోని ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నందున ములాయం... పాత మిత్రుణ్ని చెంతకు చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓసారి బహిరంగంగా, మరోసారి రహస్యంగా కలుసుకున్న వీళ్ల కలయికలు ఆ ఊహలను బలపరుస్తున్నాయి. ములాయం సింగ్ 2010లో అమర్ సింగ్ ను సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇద్దరూ ఎక్కడా కలుసుకోలేదు. అంతకుముందు ఆప్త మిత్రులుగా మెలిగిన ఈ నాయకులిద్దరూ దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల గోమతినగర్‌లో జరిగిన జ్ఞానేశ్వర్ మిశ్రా పార్క్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ములాయం, ఆయన సీఎం అఖిలేశ్‌తో కలిసి అమర్‌సింగ్ వేదిక పంచుకున్నారు. ములాయం ఆహ్వానం మేరకే ఆ కార్యక్రమానికి హాజరైన అమర్... ఇది తమ రాజకీయ ఏకీకరణ కాదని అప్పట్లో అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా వీళ్లిద్దరి మధ్యా రహస్య భేటీ జరగడం అమర్ రాకను బహిర్గతం చేస్తోంది. లక్నోలోని విక్రమాదిత్య మార్గ్‌లో ఉన్న ములాయం నివాసంలో తాజాగా ఈ భేటీ జరిగిందని ఎస్పీ వర్గాలు తెలిపాయి. అమర్ సింగ్, ములాయం చాలా సేపు మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే అమర్ సింగ్ ఈ విషయం ఏమంత పెద్దది కాదని, హంగామా చేయడం అనవసరం అని సూచించారు. నేనేమీ దొంగతనం చేయలేదు. ములాఖాత్ మాత్రమే జరిపానని అన్నారు. ములాయంతో నాకు కుటుంబసంబంధాలున్నాయి. ఇది రాజకీయ అనుంబం ధంకాదు. రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పారు. ఎస్పీ నుంచి అమర్‌సింగ్‌ను వెళ్లగొట్టిన తర్వాత ఆయన ములాయంతో భేటీ కావడం ఇదే ప్రథమం. అమర్‌సింగ్ తోసిపుచ్చుతున్నప్పటికీ, పాత మిత్రులు ఇద్దరు మళ్లీ చేతులు కలిపేందుకు రంగం సిద్ధమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: