రికార్డు స్థాయిలో దేశాన్ని పాలించిన పార్టీ అది. 125 ఏళ్ల చరిత్ర దాని సొంతం. కానీ ఈసారి మాత్రం ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. ఎంతగా అంటే లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కలేదు మరి. ఇప్పటికే ఘోర ఓటమితో మూలుగుతున్న కాంగ్రెస్ పై ఈ నిర్ణయంతో మరో తాటిపండు పడ్డట్టు అయింది. లోక్ సభలో ప్రతిపక్ష హోదా (ఎల్ఓపీ) ఆశించిన కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. సభలో ప్రతిపక్షానికి నాయకత్వం వహించే అవకాశాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ పక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఇంతకాలం ఆ సీటు పైన ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ విషయంలో నిబంధనలు, సంప్రదాయాల ప్రకారమే నిర్ణయం తీసుకున్నట్టు ఆమె విలేకరులకు తెలిపారు. తమ పార్టీ లోక్ సభా పక్ష నేతకు సభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ కు ఓ లేఖ రాసింది. వాళ్ల డిమాండ్‌ను తోసిపుచ్చుతూ తాజాగా స్పీకర్ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఓ లేఖ ద్వారా ఆ పార్టీకి తెలియజేశారు. సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పీకర్ మహాజన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అభిప్రాయాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. తర్వాత కాంగ్రెస్ కు ఆ అర్హత లేదంటూ విజ్ఞుప్తిని పక్కన పెట్టారు. ప్రతిపక్ష నాయకుడి హోదా పొందేందుకు సభలో కాంగ్రెస్ పార్టీకి తగినంత సంఖ్య బలం లేదని అటార్నీ జనరల్ నివేదించారు. ప్రస్తుత లోక్‌సభలో 44 సీట్లను గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అధికార బీజేపీకి 282 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల్లో అతిపెద్ద పార్టీగా ఉన్న తమకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టపట్టుతున్నది. అయితే, నిబంధనలను ఉటంకిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి ఈ హోదా కల్పించే పరిస్థితి లేదని స్పీకర్ వివరించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చేందుకు అవసరమైన కనీస సీట్ల సంఖ్య 55కు ఆ పార్టీ దూరంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఎంపిక విషయంలో తనకెలాంటి విచక్షణాధికారాలు లేవని, అవసరమనుకుంటే సభ ఈ నిబంధనల్లో మార్పులు చేయవచ్చునని స్పీకర్ మహాజన్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: