పదేళ్ల తర్వాత మళ్లీ యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో సమైక్య రాష్ట్రానికి ప్రతినిధిగా వ్యవహరిస్తే.. రాష్ట్రవిభజన తర్వాత తొలి పద్దును అసెంబ్లీకి సమర్పించబోతున్నారు. ఈ బడ్జెట్ మొత్తం లక్ష 11వేల కోట్ల రూపాయలతో రూపొందంచినట్టు తెలుస్తోంది. చంద్రబాబు.. తాను ప్రమాణ స్వీకారం రోజు సంతకాలు చేసిన ఐదు హామీలకు తొలి బడ్జెట్లో ప్రాముఖ్యం లభించినట్టు సమాచారం. పాదయాత్ర హామీలకు కూడా పెద్దపీట వేశారని తెలుస్తోంది. ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధనకు నిర్ధేశించుకున్నఏడు మిషన్లకు బడ్జెట్ లో ప్రాధాన్యం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ బడ్జెట్ లో ప్రణాళిక వ్యయం 20 నుంచి 25వేల కోట్ల రూపాయల వరకూ, ప్రణాళికేతర వ్యయం 80 నుంచి 85వేల కోట్ల రూపాయల వరకూ ఉండొచ్చు. రుణ మాఫీకి నేరుగా నిధులను కేటాయించటం బడ్జెట్ లో ప్రధాన అంశం కానుంది. రుణ ఉపశమనం పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన రెవెన్యూ లోటు బడ్జెట్లో దాదాపు 18వేల కోట్ల రూపాయల వరకూ ఉండే అవకాశం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ క్యాంటిన్లు, ఎన్టీఆర్ సుజల పథకాలకు ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయిస్తారట. అసంపూర్తిగా ఉన్న జలయజ్ఞం ప్రాజెక్టులను వచ్చే నాలుగేళ్లలో ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ లో వీటికి కేటాయింపులు కూడా పెంచనున్నారు. 11ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యంతో దాదాపు 7వేల కోట్ల రూపాయల వరకూ నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. శాసనమండలిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ బడ్జెట్ ప్రవేశపెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: