రాష్ట్ర విభజన తరువాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్టే లక్షకోట్ల రూపాయల మార్కును దాటింది. 1,11,823 కోట్ల రూపాయల అంచనాలతో 2014-15 ఆర్థికసంవత్సరపు బడ్జెట్‌ను రూపొందించారు. మొట్టమొదటి బడ్జెట్‌నే భారీ స్థాయిలో ప్రతిపాదించిన ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అదే స్థాయిలో లోటును చూపించారు. అదే సమయంలో ప్రైవటేకరణ రూటు పట్టారు. అన్ని భారీ మౌళిక వసతుల ప్రాజెక్టులను పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) తో చేపడతామని ప్రకటించారు. దీంతో బడ్జెట్‌ ఫలితాలు ప్రజలకు అందడం సందేహాస్పదంగా మారింది. వస్తాయో, రావో తెలియని నిధులపైన ఆధారపడి మంత్రి బడ్జెట్‌ను ప్రతిపాదించడం విశేషం. శాసన మండలిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ద్రవ్య లోటును 12,064 కోట్ల రూపాయలుగా బడ్జెట్‌ ప్రతిపాదనలో చూపించారు. జిఎస్‌డిపిలో ఇది 2.30శాతం. అయితే, ఇది పాక్షిక సత్యమే!కేంద్ర ప్రభుత్వం నుండి అదనంగా 14,500 కోట్ల రూపాయలు నిధులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ నిధులపై ఆధారపడి ద్య్రవ్యలోటును తగ్గించిచూపింది. ఆ నిధులు రాకపోతే లోటు 37,910 కోట్ల రూపాయలకు చేరుతుంది. రెవిన్యూ లోటు స్థితి కూడా ఇంతే! కేంద్ర నిధులు రాకపోతే ఆ మొత్తం 25,574 కోట్ల రూపాయలకు చేరు తుంది. ఈ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్ప టివరకు ఎటువంటి పూచీ లేదన్న లేదన్న విషయం తెలిసిందే. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రస్తావన చేయలేదు. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా మారింది. ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగడంపై నిపు ణులు అనుమానాలు వ్యక్తంచేస్తు న్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి ఈ విషయాన్ని స్వ యంగా ప్రస్తావించినా, ప్రత్యామ్నా యాలు చూప లేదు. రాష్ట్ర ఆదాయ అంచనాలను కూడా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అనూహ్యంగా పెంచి చూపారు. 37,398 కోట్ల రూపాయలు వివిధ వనరుల నుండి ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఆదాయంగా ఖజనాకు జమ చేయడాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు దాదాపు శూన్యమే అని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి, రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్న రుణమాఫీకి ఐదు వేలకోట్లను ఆర్థికశాఖ మంత్రి కేటాయించారు. దీనిలో 4వేల రూపాయలు ప్రణాళిక నిధుల కింద, మరో వెయ్యి రూపాయలను ప్రణాళికేతర నిధుల కింద ఇస్తున్నట్లు చూపారు. డ్వాక్రా, చేనేత రుణమాఫీల ప్రస్తావన లేదు. ఎన్‌టిఆర్‌ హెల్త్‌ కార్డులకు500 కోట్లతో సరిపెట్టారు. వివిధ వర్గాలకు ఇచ్చిన ఫించన్ల పెంపు వంటివాటిని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ప్రస్తావించలేదు. కేటాయింపులు.. అంతంతమాత్రమే ఇక కీలక శాఖలకు కేటాయింపులు అంతంతమాత్రమే! గత ప్రభుత్వ హయంలో భారీ కేటాయింపులు పొందిన నీటిపారుదలశాఖకు 8,465 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రణాళిక నిధుల నుండి ఈ శాఖకు (మైనర్‌ ఇరిగేషన్‌తో కలిపి) దక్కింది 3,210 కోట్ల రూపాయలు మాత్రమే! రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా పదేపదే చెబుతున్న వ్యవసాయరంగానికి ప్రణాళిక నిధుల్లో 10,122 కోట్ల రూపాయలతో సరిపెట్టారు. విభజన తరువాత అత్యంత కీలకంగా మారిన ఇంధన శాఖకు 86.59 కోట్ల రూపాయలే దక్కాయి. ఉచిత విద్యుత్‌ సబ్సిడీకోసం 3,188 కోట్ల రూపాయలను నాన్‌ప్లాన్‌లో చూపారు. ఇక కీలకమైన తాగునీటికి గతంతో పోలిస్తే కేటాయింపులు తగ్గాయి. నిరుద్యోగులకు మంత్రి ఎటువంటి సానుకూల సంకేతం ఇవ్వలేదు. చంద్రబాబుకు గుర్తింపుతెచ్చిన ఐటి రంగానికీ 111 కోట్ల రూపాయలతో సరిపుచ్చారు. కేటాయింపులు తక్కువైనప్పటికీ ఈ రంగం నుండి భారీ ఎగుమతులను లక్ష్యంగా నిర్థారించి, ఆ మేరకు ఆదాయం ఖజానాకు జమఅవుతుందని చెప్పడం కాగితాలపై అంకెలను భారీగా చూపించడానికే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విభజన నేపధ్యంలో పారిశ్రామికరంగానికి ప్రాధాన్యత ఇస్తామని సుదీర్ఘం చెప్పిన మంత్రి చివరకు 600 కోట్ల రూపాయలతో సరిపుచ్చారు. మౌళికవసతులకు ఇదే స్థితి. రోడ్లతో పాటు వివిధ మౌళిక వసతుల అభివృద్ది పనులు చేయాల్సిన శాఖలకు 400 కోట్ల రూపాయలతో సరిపెట్టారు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటుభాగస్వామ్యంలో చేపడతామని చెప్పడంతో ప్రైవేటుకు పట్టం కట్టనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: