ప్రత్యేక ఆర్ధిక మండళ్లను దేశంలో తొలుత ఏర్పాటు చేసిన ఘనత ఆంధ్ర రాష్ట్రానికి దక్కినా, ఈ సెజ్‌ల్లో పరిశ్రమల స్ధాపన, ఉద్యోగాల కల్పన, ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతుల టర్నోవర్ తీరు ఆశాజనకంగా లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 32 సెజ్‌లు ఉన్నాయి. ఇందులో పది ఐటి సెజ్‌లు, ఆరు బహుళ ఉత్పత్తుల సెజ్‌లు, నాలుగు ఫార్మాసూటికల్స్, రెండు బయోటెక్ , పది ప్రత్యేక సెజ్‌లు ఉన్నాయి. ఏపిఐఐసి ఆధ్వర్యంలో పది , ఏపిఐఐసి జెవి ఆధ్వర్యంలో మూడు, ఏపిఐఐసి సహాయంతో ఏర్పాటు చేసిన సెజ్‌లు మూడు, ప్రైవేట్ డెవలపర్స్ ఏర్పాటు చేసిన సెజ్‌లు 12 కలిపి 32 ఉన్నాయి. మొత్తం సెజ్‌లను 13,859.09 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటుచేయగా, 49,321 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఈ సెజ్‌ల నుంచి 2342.89 కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయి. ఈ వివరాలను రాష్ట్రప్రభుత్వం 2014-15 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా విడుదల చేసిన సామాజిక, ఆర్ధిక సర్వే పుస్తకంలో పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఒక్క సెజ్ కూడా లేదు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్‌ఆర్, కర్నూనలు జిల్లాల్లో సెజ్‌లు ఏర్పాటు చేసినా పెట్టుబడులు రాలేదు. ఇక్కడ వౌలిక సదుపాయాలను కల్పించలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపిఐఐసి రెండు జాతీయ పెట్టుబడుల తయారీ జోన్లను తిరుపతి, ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వీటిని ఐదు నుంచి ఆరువేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో జోన్‌లో 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని అంచనా. మూడు లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో భూమి సేకరణకు సంబంధించిన పనులు వేగవంతమవుతున్నాయి. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో ఒకటి, విశాఖపట్నంలో పది, తూర్పుగోదావరిలో నాలుగు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్క సెజ్, నెల్లూరు జిల్లాలో ఐదు, వైఎస్‌ఆర్ జిల్లాలో రెండు, అనంతపురంలో మూడు, చిత్తూరు జిల్లాలో రెండు సెజ్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మొత్తం సెజ్‌ల్లో 49,321 మందికి ఉద్యోగాలు కల్పించగా, 2624.01 కోట్ల రూపాయల ఉత్పత్తి జరుగుతోంది. ఈ సెజ్‌ల నుంచి ఎగుమతులు 2342.89 కోట్ల రూపాయలు, దిగుమతులు 1905.45 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని సర్వేలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: