ఈశాన్య రాష్ట్రాలు రగిలిపోతున్నాయి. అల్లర్లు కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. ప్రభుత్వాలు చేష్ఠలుడిగి చూస్తోంటే అమాయకులపై లాఠీలు నృత్యం చేస్తున్నాయి. మా మనోభావాలు పట్టించుకోండి అంటూ నిరసన ప్రదర్శిస్తున్న వారిని తూటాలు తరిమికొడుతున్నాయి. అస్సాం-నాగాలాండ్ సరిహద్దు రగిలిపోతోంది. ఆక్రమణదారులు మీరంటే మీరంటూ రెండు రాష్ట్రాల వారు కొన్నేళ్ల నుంచి చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. నాగాలాండ్ రాష్ట్రంగా అవతరించిన నాటినుంచి కొనసాగుతున్న అల్లర్లు కొన్ని రోజుల నుంచి మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. నాగాలాండ్ నిరసనకారుల చేతిలో మరణించిన 15మంది అస్సామీ యువకులకు మద్దతుగా అస్సాం ఆదీవాసీ విద్యార్ధి సంఘం గోలాఘాట్‌లో రాస్తారోకోను తలపెట్టింది. తమ ఆందోళనలో భాగంగా విద్యార్ధులు హైవేను దిగ్భందించేందుకు ప్రయత్నించారు. ఇందుకు వాహనదారులు ఒప్పుకోకపోవటంతో ఆదివాసీ యువకులు కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు.పరిస్ధితి చేయిదాటడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. నిరసనకారులు బలగాలపై తిరగబడ్డారు. దీంతో రెచ్చిపోయిన CRPFజవాన్లు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. చేతికి అందిన వారిని అందినట్లు చావబాదారు. విద్యార్ధులు రాళ్లదాడికి దిగటంతో పోలీసులు కాల్పులు జరిపారు. బలగాలు జరిపిన కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు కానీ లాఠీఛార్జ్‌ల్లో మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన అస్సాం సీఎం తరుణ్ గొగోయ్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రయత్నం విఫలం కావటంతో కాన్వాయ్‌పై బాధితులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులపై బలగాలు జరిపిన విచక్షణారహిత దాడిపై ప్రజాస్వామ్యా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసాయి. ఇందుకు స్పందించిన అధికారులు కొందరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ నెల 21న నాగాలాండ్ ఉన్నతస్ధాయి అధికారులతో చర్చించి సమస్య పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తానని అస్సాం సీఎం తరుణ్‌ గొగోయ్‌ హామీ ఇచ్చారు. అయినప్పటికి గోలాఘాట్‌తో పాటు అస్సాం-నాగాలాండ్ సరిహద్దు రగిలిపోతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: