మొన్నటి వరకూ రుణమాఫీ అమలు గురించి అనేక రకాల కహానీలు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బడ్జెట్ తో వ్యవహారాన్ని మరో మలుపుతిప్పింది. రైతు రుణమాఫీ గురించి ఎలాంటి కేటాయింపులూ జరపకపోవడం ద్వారా దాని అమలును ప్రశ్నార్థకం చేసింది! ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం అంటూ... అంకెల గారడీ చేసినప్పటికీ ఎక్కడా రైతురుణమాఫీకి అంటూ ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగలేదు. దీంతో రుణమాఫీ అసలు అమలవుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గురువారం రోజున అసెంబ్లీ లేదు.. శుక్రవారం రోజున ప్రవేశపెట్టే వ్యవసాయ బడ్జెట్ లో రైతు రుణమాఫీ గురించి వివరణ ఉంటుంది.. అంటూ తెలుగుదేశం వాళ్లు అంటున్నారు. మరి వ్యవసాయ శాఖ కు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఘనతకూడా మాదే అంటూ జబ్బలు కూడా చరుచుకొంటున్నారు తెలుగుదేశం వాళ్లు. అయితే వ్యవసాయ బడ్జెట్ మొత్తం ఎంత? అనే విషయాన్ని వారు ప్రస్తావించడం లేదు. రైతు రుణమాఫీ అమలుకు ఖర్చు పెట్టాల్సిన నిధుల స్థాయిని.. వ్యవసాయ బడ్జెట్ ను పోల్చి చూసుకొంటే... ఏ మాత్రం పోలిక ఉండదు.ఎన్నికల హామీలో పేర్కొన్నట్టుగా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయాలంటే... లక్షన్నర కోట్లరూపాయలు కావాలి. అలాగాక అనేక రకాల షరతులను పెట్టుకొంటే వచ్చినా... ఖర్చు చేయాల్సిన మొత్తం కూడా భారీగానే ఉంది. మరి ఆ మొత్తం దాదాపు 60 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. మరి వ్యవసాయ బడ్జెట్ అంతా కలుపుకొన్నా.. దాని స్థాయి 20 వేల కోట్ల రూపాయలేనని గణాంకాలుచెబుతున్నాయి. మరి ఆ 20 వేలలో వ్యయం ఏమిటో.. ఆదాయం ఏమిటో... అంతుబట్టడం లేదు. అయినా 60 వేల కోట్ల రూపాయల వ్యవహారాన్ని 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఎలా పొందుపరుస్తారు?! అనేవి సందేహాలు! మొత్తానికి వార్షిక బడ్జెట్ లో రుణమాఫీ వ్యవహారాన్ని ప్రస్తావించకుండానే తెలుగుదేశం ప్రభుత్వం ముందుకుసాగుతోంది. దీంతో రైతులది దిక్కుతోచని స్థితే అవుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: