ఎలాగూ వచ్చే ఐదేళ్ల వరకూ ఎన్నికలు లేవు... ప్రస్తుతం చేతిలో పదవిలేదు... పార్టీ అధికారంలో లేకపోయినా కనీసం పదవి అయినా ఉంటే... అంతో ఇంతో కళ వస్తుంది. మరి అందుకోసం అదృష్టాన్ని పరీక్షించుకొందామని అనుకొంటున్నారు అనేక మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం వీరి దృష్టి మెదక్ ఉప ఎన్నికల మీద ఉంది. కేసీఆర్ ఎంపీ పదవికి చేసిన రాజీనామాతో మెదక్ లో ఉప ఎన్నికల అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం కోసం అనేక మంది కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ సీనియర్లు, మొన్నటి వరకూ ముఖ్యమైన స్థాయిల్లో ఉన్న నేతలు ఇక్కడ నుంచి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మరి వారిలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహా, మెదక్ జిల్లా నేత జగ్గారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ టికెట్ రేసులో తను కూడా ఉన్నానని అంటున్నాడు సర్వే సత్యానారాయణ. ఈ విధంగా కాంగ్రెస్ లోని అనేక మంది నేతలు ఇప్పుడు మెదక్ సీటు మీద దృష్టిపెట్టారు. అయితే మెదక్ ఎంపీ ఎన్నికల గురించి వ్యూహం రచించాలని మొదట సమావేశంఅయిన కాంగ్రెస్ పార్టీ కోదండరాం పేరును ప్రస్తావించింది. ఆయనను పోటీ లో నిలిపితే ఈ సీటు మనదేనని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు కోదండరాం పేరును ప్రస్తావించే వాళ్లు లేకుండా పోయారు. కాంగ్రెస్ లో ని ముఖ్యనేతలు అంతా ఎవరికి వారు తామే పోటీ చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరికొందరు కాంగ్రెస్ నేతలు అయితే ఈ నియోజకవర్గంలో తామే గెలిచేస్తామని అంటున్నారు! మరి విజేతగా నిలవడం మాట ఎలా ఉన్నా... కనీసం రెండో స్థానంలో నిలిచినా అది కాంగ్రెస్ కు అనందాన్ని ఇచ్చే అంశం, భవిష్యత్తుకు భరోసాని ఇచ్చే అంశం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: