హైదరాబాద్ లో శాంతిభద్రతలు... ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటున్న ఈ అంశం ఇప్పుడు మళ్లీ ఢిల్లీ చేరింది. రెండు తెలుగు రాష్ట్రాలకూ ఉమ్మడి రాజధానిగా ఉన్న భాగ్యనగరంలో లాఠీ పెత్తనం గవర్నర్ చేతుల్లో పెట్టాలంటూ కేంద్రం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. విభజన చట్టంలో పేర్కొన్నట్లు నడుచుకోవాలని కోరింది. అయితే ఈ అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. అవసరమైతే కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటాం తప్ప అధికారాలు అప్పగించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే తాజాగా జరుగుతున్న గవర్నర్ ఢిల్లీ టూర్ ఇదే అంశం పై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ నరసింహన్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, న్యాయ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ కుమార్‌ దోవల్‌ లతో సమావేశమయ్యారు. కీలక మంతనాలు జరిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌ లో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టంలో కల్పించిన అంశాలపైనే ఆయన సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. గవర్నర్ ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుసుకోనున్నారు. ఈ భేటీ తర్వాత పరిస్థితిలో స్పష్టత ఏర్పడొచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం. కేసీఆర్ సింగపూర్ పర్యటనకు వెళ్లిన సమయంలో గవర్నర్ ఢిల్లీ వెళ్లడం గమనార్హమని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అయితే శాంతి భద్రతల అంశం పై చర్చించారా అన్న ప్రశ్నకు మాత్రం గవర్నర్ సమాధానం దాట వేశారు. ఢిల్లీ వచ్చి హోం మంత్రిని కలిశానని, రాష్ట్రపతి, ప్రధానితో పాటు వీలైనంత ఎక్కువ మందిని కలుస్తానని చెప్పారు. ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశం వివరాలను హోం మంత్రికి వివరించానని, ఇరు రాష్ట్రాల సీఎంలూ విభజన సమస్యల పరిష్కారానికి సానుకూ లంగా ఉన్నారని, చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటామని వారు తెలిపినట్టు వివరించానన్నారు. మరోసారి సీఎంల భేటీ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించగా.. ఇరువురు సీఎంలే అన్నీ చర్చించుకుని పరిష్కరించుకుంటారని, వారు చాలా సానుకూలంగా ఉన్నారని అన్నారు. గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు ఇవ్వటాన్ని టీఆర్‌ ఎస్‌ వ్యతిరేకిస్తోంది కదా అని ప్రస్తావించగా.. ఆ విషయం తనకు తెలియదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: