ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ భంగపాటు నేపథ్యంలో కోచ్ డంకన్ ఫ్లెచర్ మెడపై కత్తి పెట్టిన బీసీసీఐ నూతన కోచ్ కోసం అన్వేషిస్తున్నట్టు సమాచారం. రాజీనామా విషయంలో బీసీసీఐ ఇప్పటికే ఫ్లెచర్ కు స్పష్టమైన సంకేతాలిచ్చిన తరుణంలో 'మిస్టర్ డిపెండబుల్' పేరు తెరపైకి వచ్చింది. బోర్డు పొమ్మనకుండా పొగబెట్టిన చందాన... కటువుగా వ్యవహరిస్తాడని పేరున్న రవిశాస్త్రిని కాస్తా ఫ్లెచర్ కు ముందు సీట్లో కూర్చుండబెట్టింది. కామెంటరీ చెప్పుకుంటున్న ఈ మాజీ ఓపెనర్ ను తీసుకువచ్చి టీమిండియాకు కోచింగ్ డైరక్టర్ గా నియమించడం ఫ్లెచర్ ను సాగనంపడానికేనన్నది క్రికెట్ వర్గాల అభిప్రాయం.  విండీస్ తో సొంతగడ్డపై సిరీస్ కు ఫ్లెచర్ వైదొలగాలనుకుంటే తామేమీ అడ్డుపడబోమని బీసీసీఐ తెలిపింది కూడా. దీంతో, వచ్చే సిరీస్ కు భారత జట్టుకు కొత్త కోచ్ రానుండడం ఖాయమేననిపిస్తోంది. కాగా, టీమిండియాకు కోచ్ గా వ్యవహరించడానికి రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్ తగిన వ్యక్తులని క్రీడాపండితులంటున్నారు. ప్రస్తుత జట్టులోని అత్యధికులతో డ్రెస్సింగ్ రూం పంచుకుని ఉండడం ద్రావిడ్ కు కలిసొచ్చే అంశం. పైగా, క్రికెటర్లలో మర్యాద రామన్నగానూ పేరుంది. ఏదేమైనా, టీమిండియా కొత్త కోచ్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: