ఎదుటి వాడిని ఓ దెబ్బ వేయాలంటే ముందు మనం బలంగా ఉండాలి. అలా కొట్టేందుకు ఎదుటి వాడు ఏదైనా తప్పు చేయాలి. ఆ రెండూ ఉన్నా... కొట్టిన తర్వాత దెబ్బతిన్నవాడు ఇచ్చే జవాబును ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలైనా ఉండి ఉండాలి. కాని భారత్ విషయంలో తరచూ కాలుదువ్వుతున్న పాక్ కు ఇవేవీ లేవు. స్వదేశంలో లెక్కకు మిక్కిలి సమస్యలు. గట్టిగా మాట్లాడితే.. గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. ప్రభుత్వాలు తమ మాట వినకుంటే.. తీవ్రవాదులు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తారో తెలియని స్థితి. పేదల ఆకలి కేకలు, ఉద్యోగాల కోసం యువకుల గగ్గోలు. ఒకటా రెండా.. ఇంట్లో లెక్కకు మిక్కిలి సమస్యలు పెట్టుకుని పొరుగిల్లైన భారత్ లో ఎలా మంటపెడదామా అన్నదే... పాక్ నిత్యం ఆలోచించే కుటిల బుద్ధి. పాకిస్తాన్ జనాభా 18 కోట్లు. అదే మన దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ జనాభా 20 కోట్లు. భారత్ లోని ఓ రాష్ట్రం కంటే కూడా చిన్నదైన పాకిస్తాన్.. భారత్ నే సవాల్ చేసే పరిస్థితి. 18 కోట్ల జనాభా ఉన్న ఓ చిన్న దేశం.. 125 కోట్ల జనాభా కల్గిన భారత్ కయ్యానికి సిద్ధం అన్నట్లు ప్రవర్తన. అసలు పాకిస్తాన్ కు ఇంత కోపం ఎందుకు. ఏం చూసుకుని ఆ అహంకారం. యుద్ధాలు చేసి భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నా... ఎందుకా టెంపరితనం. అక్కడ ప్రభుత్వాలు ఎప్పుడూ స్ధిరంగా ఉండవు. ప్రజా ప్రభుత్వాలైనా, సైనిక పాలకులైనా... భారత్ పట్ల వారి వైఖరి ఏమాత్రం మారదు. భారత్ పట్ల పాక్ పాలకులందరిదీ కల్లు తాగిన కోతి బుద్ధే. ఎప్పుడు అగ్గి రాజేద్దామా. భారత్ పట్ల తమ కోపాన్ని ఎలా ప్రకటిద్దామా. ఏం చేస్తే భారత్ కు కోపం వస్తుందో అని పాకిస్తాన్ కు నిత్యం ఒకటే ఆలోచనలు. భారత్ లో జరిగే ప్రతి తీవ్రవాద దాడికి మూలం పాకిస్తాన్ లోనే. సరిహద్దుల వద్ద గత పది రోజుల వ్యవధిలో ౯ కవ్వింపు చర్యలు. ఇవి చాలన్నవన్నట్లు భారత్ లో ఉంటూ పాక్ ను ప్రేమించే వేర్పాటువాదులతో చర్చలు. ఒకటేమిటి... పాక్ పాపాల చిట్టా రాస్తే ఈ భూమ్మీద కాగితాలకే కొరత ఏర్పడుతుంది. భారత్ మీద పాకిస్తాన్ కు ఎందుకంత కోపం అంటే.. కాశ్మీర్ మీద ఆధిపత్యం కోసం. దేశ విభజన జరిగినప్పటి నుంచి కాశ్మీర్ మీద భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ పేచీయే. అయితే పాకిస్తాన్ పెట్టే పేచీలో మాత్రం ఏమాత్రం న్యాయం లేదు. కాశ్మీర్ మీద ఎప్పుడూ తొండి ఆటలు ఆడుతూ.. కాశ్మీర్ ను తమలో కలుపుకోవాలని పాక్ పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. భారత్ లో ఓ రాష్ట్రానికి సరిపడా జనాభా ఉండే చిన్న దేశమైన పాకిస్తాన్ తాను పుట్టినప్పటి నుంచీ కాశ్మీర్ విషయంలో భారత్ మీద రెచ్చిపోతూనే ఉంది. మరి పాకిస్తాన్ తమ దేశంలో అన్నీ సరిగా ఉండి కాశ్మీర్ కోసం భారత్ తో పోట్లాడుతుందా అంటే అస్సలు కాదనే చెప్పాలి. అక్కడ సుస్థిరమైన ప్రభుత్వమే ఉండదు. ప్రభుత్వాలు గద్దెనెక్కినా ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. ప్రభుత్వాలకు సైన్యం మీద నియంత్రణ ఉండదు. ప్రభుత్వాలు గట్టిగా మాట్లాడితే సైన్యం అస్సలు తట్టుకోలేదు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టి తామే అధికారంలోకి వచ్చేసి ప్రభుత్వాన్ని కాళ్ల కింద పెట్టేసుకుంటుంది. ఇక ప్రతిపక్షాలదీ అదే వరస. ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడు కూలగొడదామా, తామెప్పుడు అధికారంలోకి వద్దామా అన్న ఆలోచనలే. ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో దేశమంతా హోరెత్తిస్తుంటాయి పాక్ లోని విపక్షాలు. ఇప్పుడు ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేక ఇమ్రాన్ ఖాన్ కొనసాగిస్తున్న ఆందోళనలు అలాంటి కోవలోవే. రోమ్ కాలిపోతూ ఉంటే చక్రవర్తి ఫీడేలు వాయించినట్లు ఉంటుంది పాక్ పాలకుల పరిస్ధితి దేశం కాలిపోతున్నా.. అక్కడి పాలకులదు పట్టదు. నిత్యం రగులుతూ ఉండే గొడవల మధ్యఇక ప్రజల సంక్షేమం దేవుడెరుగు, తమ సీటు కాపాడుకుంటే చాలన్నట్లు ఉంటుంది పాకిస్తాన్ లో ప్రభుత్వాల పరిస్థితి. దీనికి తోడు సైన్యం అండతో పని చేస్తూ ప్రభుత్వాలను శాసించే తీవ్రవాదుల రొద మరో వైపు. వినకుంటే బాంబుల మోతతో దాడులు ఇంకో వైపు. పొరుగున ఉన్న ఆప్ఘనిస్తాన్ కేంద్రంగా పని చేసే తీవ్రవాదులకు పాకిస్తాన్ షెల్టర్ జోన్. అలా ఆప్ఘన్ మీదుగా పాక్ వచ్చే తీవ్రవాదులు యధేచ్ఛగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడి పాలకులను, సైన్యాన్ని శాసిస్తూ ఉంటారు. భారత్ మీద కోపంతో అక్కడి సైన్యం కూడా లోపాయికారిగా తీవ్రవాదులతో కలిసి పని చేస్తూ ఉంటుంది. భారత్ లో దాడులకు తీవ్రవాదులకు అక్కడి సైన్యం పూర్తి సాయం అందిస్తూ ఉంటుంది. సైన్యం ఆధ్వర్యంలో నడిచే ఐఎస్ఐకి ఇదే పని. తీవ్రవాదులు అంత అండగా ఉన్నారు కాబట్టే సరిహద్దుల వద్ద పాక్ అలా తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. భారత్ తో శాంతి చర్చల మీద పాకిస్తాన్ కు ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఎప్పుడూ ఘర్షణ పూరిత వాతావరణ కొనసాగిస్తూ ఉంటేనే వారికి అక్కడి ప్రజల దృష్టిలో మంచి పేరు ఉన్నట్లు. ఆ విధంగా అక్కడి ప్రజలను కూడా పాక్ పాలకులు అలా తయారు చేసి ఉంచారు. ప్రభుత్వాలైనా, సైన్యం అయినా, తీవ్రవాదులైనా.. తమ మనుగడకు ఏమాత్రం భంగం వాటిల్లిందని అనిపించినా.. భారత్ కు వ్యతిరేకంగా ఇలా నిప్పు రాజేస్తూ ఉంటారు. భారత్ లో తీవ్రవాద కార్యకలాపాలైనా, సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలైనా.. ఈ కోవలోనివే. అయితే కాశ్మీర్‌ లో చెలరేగిపోతున్న ఉగ్రవాదులందర్నీ పాక్.. స్వాతంత్య్ర సమరయోధులుగానే ప్రచారం చేస్తోంది. కాశ్మీర్‌లో వాళ్ళు పూర్తి అభద్రతలో ఉన్నారన్నది కూడా పాకిస్తాన్ వాదన. గడిచిన రెండు దశాబ్దాలుగా భారత సరిహద్దు భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో నూటికి 90శాతం మంది ఉగ్రవాదులు మరణిస్తుంటారన్నది ప్రజా బాహుళ్యం వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఇలా చనిపోతున్న వాళ్ళంతా డబ్బుకోసం ఆశపడి ఉగ్రవాదులుగా మారిన విదేశీయులే తప్ప, వాళ్ళు అటు కాశ్మీర్‌కు కానీ, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌కు కానీ చెందిన పౌరులు కారని స్థానికులు చెబుతున్నారు. ఈ విదేశీయలకు పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ 'ఐఎస్‌ఐ' ఆయుధాల్ని, శిక్షణను అందిస్తోంది. సైనిక పరమైన పరిష్కారాల గురించే ఆలోచిస్తూ కాలయాపన చేయకుండా, సీమాంతర ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు భారత్‌ కూడా తక్కువ వ్యయంతో కూడిన క్రియాశీలక విధానాన్ని అనుసరించాలి. పాక్ పన్నాగాలను బలంగా తిప్పికొట్టాలి. తమ స్వార్థంతో ఒక పెద్ద దేశాన్ని ఆడుకోవడం సాధ్యం కాదనే విషయాన్ని పాక్ కు కఠినంగా చెప్పాలి. అప్పుడే ఉగ్రవాద దేశం వెనక్కి తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: