విభజన వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వైకుంఠపాళీలా తయారైందని, పాము కరిస్తే కిందకు వస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన తప్పునకు ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల వర్కుషాప్‌ను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రారంభించారు. రాజధాని ఎక్కడ? అన్నది ఇంకా నిర్ణయం కాలేదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినా, సమస్యలు మాత్రం మిగిలే ఉన్నాయన్నారు. వర్కుషాప్‌లో ఉప ముఖ్యమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కెఇ కృష్ణమూర్తి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఏడు మిషన్లపై వర్కుషాప్‌ను ఏర్పాటు చేశారు. ప్రాథమిక రంగం, సామాజిక సాధికారికత, విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు, సేవారంగాలపై వర్కుషాప్ నిర్వహించారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చామని గుర్తించాలని ముఖ్యమంత్రి కార్యకర్తలకు, నాయకులకు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లడానికే యాక్షన్ ప్లాన్ రూపొందించామని, దీనిలో భాగంగా ప్రతిపాదించిన ఏడు మిషన్లపై అవగాహనకు వర్కుషాప్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పదేళ్లుగా తాను అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తున్నానన్నారు. విభజన సమయంలో అనేక అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి వివరించామని చెప్పారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు సూచించారు. పార్టీ కార్యక్రమాలపై కూడా ఎప్పటికపుడు సమీక్షలు జరగాలని చెప్పారు. పార్టీని గ్రామస్థాయి నుండి సమన్వయం చేయాలని, నాయకుల్లో నైపుణ్యం పెంచాలన్నారు. ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బిసి, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మరోసారి స్పష్టం చేశారు. పదేళ్ల తర్వాత గ్రామస్థాయి నుండి దేశస్థాయి వరకూ కొత్త పాలన వచ్చిందని, ప్రతి ఒక్కరూ మార్పును సీరియస్‌గా తీసుకోవాలన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. విద్యుదుత్పత్తిలోనూ అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. గత పదేళ్లలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందని, అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రధానిపై సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించిందని, మంత్రులు, ఐఏఎస్, పారిశ్రామిక వేత్తలు జైలుకు వెళ్లారన్నారు. గత పదేళ్లు దగాపడిన దశాబ్దంగా చంద్రబాబు అభివర్ణిచారు. రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు వచ్చాయని , కాంగ్రెస్ తప్పు చేసినందుకే ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క సీటూ గెలవలేదని ఎద్దేవా చేశారు. సుస్థిర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. దేశంలో ఒక పార్టీకి పూర్తి మెజార్టీ రావడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడనేది ఇంకా నిర్ణయం కాలేదని, ఇరు రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముందుకు వచ్చారని చంద్రబాబు చెప్పారు. క్యాడర్ విభజన ఇంకా పూర్తికాలేదని, వర్శిటీలు సహా 89 సంస్థలు ఇంకా ఉమ్మడిగానే ఉన్నాయన్నారు. పరస్పర అంగీకారంతోనే విభజన జరగాలని చంద్రబాబు ఆకాంక్ష వ్యక్తం చేశారు. సమస్య ఏదైనా సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా కోలుకునేందుకు కేంద్రం ఉదారంగా సాయం చేయాలని కోరారు. విభజన చట్టంలో ప్రస్తావించిన సంస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఏపీలో నీరు, విలువైన ఖనిజ సంపద ఉందని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంథానం చేస్తే వెయ్యి టిఎంసిల నీటిని వాడుకోవచ్చని చెప్పారు. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు గురుత్వాకర్షణ ద్వారా నీరు ఇవ్వొచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత పెంచాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పేదరికం గెలుపే ప్రభుత్వ లక్ష్యమని బాబు చెప్పారు. భవిష్యత్‌లో సర్వీసు రంగమే కీలకమని, సర్వీసు రంగంలోనే ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. మైపాడు నుంచి శ్రీకాకుళం వరకూ ఎన్నో బీచ్‌లు ఉన్నాయని , బీచ్‌లు చారిత్రక కట్టడాలను అనుసంథానం చేస్తూ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏ పనిలోనైనా నైపుణ్యత ముఖ్యమని పేర్కొన్నారు. వాటర్‌గ్రిడ్ ద్వారా సేద్యం, పరిశ్రమలకు నీటి కొరత లేకుండా చూస్తామని , రోడ్ గ్రిడ్‌తో రవాణా మెరుగుపరుస్తామని, ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: